– మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న బనారస్‌లో కఠిన నిబంధనలు..
టమాటా ధర మంటపుట్టిస్తోంది. కిలో రూ.వంద నుంచి 250 వరకూ పలుకు తోంది. కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న బనారస్ నియోజకవర్గంలో టమాటా గురించి మాట్లాడితే బొక్కలో వేసేయటానికి యోగి వెనుకాడటం లేదు.
తమ ఇంటిపై బుల్డోజర్ నడుపుతారేమోనని విక్రయదారుడికి భయం
జైలు పాలైన కూరగాయల విక్రేత, అతని తనయుడు
లక్నో : టమాటా ధర పెరిగాక తోటల్లోనే కాదు. వాహనాల్లోను చోరీకి పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ లోని బనారస్‌లో టమాటాలు అమ్ముకోవ టానికి బౌన్సర్లను పెట్టుకోవటం నేరమైంది. నీకు ఎంత ధైర్యముంటే మోడీ సొంత నియోజవర్గం లోనే టమాటాలను బౌన్సర్లను పెట్టి అమ్ముతావా..? అంటూ విక్రయదారుడితో పాటు అతని తనయుడిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తండ్రీ కొడుకులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో నామినేటెడ్ ఎస్పీ నేత అజరు యాదవ్ అలియాస్ అజరు ఫౌజీ అరెస్ట్ కోసం క్రైం బ్రాంచ్ గాలిస్తోంది. టమాటా ధరపై బీజేపీ సర్కార్‌ను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ టార్గెట్ చేశారు. దీంతో మోడీ పార్లమెంటరీ నియోజకవర్గంలో టమోటా ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ప్రశ్న కారణంగా రాజకీయాలు వేడెక్కాయి.
ఏం జరిగిందంటే..?
జులై 9, 2023న వారణాసిలోని లంక ప్రాంతంలో కూరగాయల విక్రయదారుడు రాజనారాయణ యాదవ్ ఉన్న వీడియోను వార్తా సంస్థ విడుదల చేసింది. ధరల పెరుగుదలపై వ్యంగ్య పోస్టర్ , బౌన్సర్‌లతో టొమాటోలు అమ్ముతున్న చిత్రం, కొన్ని వీడియోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఇద్దరు బౌన్సర్లు కూరగాయల దుకాణం వెలుపల ఉన్నారు. వారు నల్ల చొక్కాలు, ముదురు గ్లాసెస్ ధరించి ఉన్నారు. ఇద్దరు బౌన్సర్లు వాకీ-టాకీలతో సెక్యూరిటీగా నిలబడి ఉండగా.. దుకాణ దారుడు నేలపై కూర్చున్నాడు. అతని ముందు టమోటాలు, మిరపకాయలు, కొత్తిమీర సహా పలు రకాల కూరగాయలు ఉన్నాయి. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ప్రింటవుట్‌లు తీసి కొందరు ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఒకదానిపై టమాటా, మిరపకాయలు ముట్టుకోకూడదని బోర్డు పెట్టారు. మరొకదానిపై మొదట డబ్బు తరువాత టమోటాలు అని రాశారు. తొమ్మిదేండ్ల ద్రవ్యోల్బణం అని మూడోదానిపై రాసి ఉంది. ఇది పొలిటికల్ సెటైర్ అని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో సామాన్యులపై ఘాటైన వ్యాఖ్య అని బీజేపీ, యోగి సర్కార్ భావించింది.
టమాటా ధరల పెరుగుదలకు సంబంధించి పీటీఐ వీడియోను విడుదల చేసిన వెంటనే, ప్రజలు సోషల్ మీడియాలో బీజేపీ ప్రభుత్వాన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. బనారస్ కమిషనరేట్ పోలీసులు రంగంలోకి దిగడంతో పాటు పరిపాలన కూడా రంగంలోకి దిగింది. లంక పోలీస్ స్టేషన్ ఏరియాలోని నాగ్వా ఔట్‌పోస్టు ఇన్‌చార్జి మిథిలేశ్ యాదవ్ కూరగాయల విక్రేత రాజనారాయణ యాదవ్, అతని కుమారుడు వికాస్ యాదవ్, ఎస్పీ నాయకుడు అజరు ఫౌజీతో సహా ఐదుగురిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
భేల్‌పూర్ ఏసీపీ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ, శత్రుత్వాన్ని పెంపొందించడం, సామరస్యానికి భంగం కలిగించడం వంటి సెక్షన్లు, 295 ఏ (మత మనోభావాలను దెబ్బతీయడం) , సెక్షన్ 505 (2) (అబద్ధాలు చెప్పి వివిధ వర్గాల మధ్య గొడవలు పెట్టడం) కింద కేసులు నమోదు చేశారు.కూరగాయల వ్యాపారి రాజనారాయణ యాదవ్ , అతని కుమారుడు వికాస్ యాదవ్‌లను అరెస్టు చేసి పంపారు.
ఈ చర్యపై అఖిలేశ్ ఆగ్రహం
టమాటా ద్రవ్యోల్బణంపై ప్రశ్న లేవనెత్తిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజరు ఫౌజీ, కూరగాయల అమ్మకం దారులైన తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవటంపై జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టమాటాను బౌన్సర్‌తో విక్రయిస్తున్న వీడియోను విడుదల చేసిన ఏజెన్సీ పీటీఐ విచారం వ్యక్తం చేస్తూ ఆ వార్తలను తొలగించింది. అయితే కూరగాయల విక్రేతకు మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అనుకూలంగా నిలిచారు. అతను వరుసగా రెండుసార్లు ట్వీట్ చేసాశారు. ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అనే మాట ఈ వాతావరణంలో అర్థంలేనిది. ఇది జుమ్లాలా కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉంటే, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఏం జరుగుతుంది.? కూరగాయల విక్రయదారుడిని వెంటనే విడుదల చేయాలి అని ఎస్పీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల విక్రయదారులు కూడా యోగి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనారస్ కమిషనరేట్ పోలీసుల చర్య ఏకపక్షం, చట్ట విరుద్ధం. ఈ కేసు ఎత్తివేయాలి. పోలీసుల నుంచి కార్మికుడిని విడుదల చేయాలని ఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. లంక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు, ఎస్పీ నేతల మధ్య గంటల తరబడి పంచాయితీ కూడా సాగింది, అయితే అదుపులోకి తీసుకున్న కూరగాయల వ్యాపారులిద్దరినీ విడుదల చేసేందుకు పోలీసులు అంగీకరించలేదు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంకావటంతో.. యూపీలోని కూరగాయల వ్యాపారులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టమాటా విక్రయదారుడ్ని,అతని కుమారుడ్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు తమ ఇండ్లను బుల్డోజర్లతో యోగి సర్కార్ ఎక్కడ కూలదొస్తుందోనన్న భయం కూరగాయల విక్రేతను వెంటాడుతోంది.