లక్నో : దళిత నాయకులు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ అజాద్‌పై ఉత్తరప్రదేశ్‌లో గుర్తు తెలియని దుండగులు బుధవారం కాల్పులు జరిపారు. సహరన్‌పూర్ జిల్లాలోని డీయోబండ్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో అజాద్ గాయపడ్డారు. డియోబండ్‌లోని ఒక మద్దతుదారుడి ఇంటి వద్ద ఒక కార్యక్రమంలో హజరుకావడానికి వెళుతుండగా అజాద్ ప్రయాణిస్తున్న ఎస్‌యువిపై దుండగులు అనేక రౌండ్ల పాటు కాల్పులకు తెగబడ్డారు. దుండగులు కూడా కారులో నుంచే కాల్పులు జరిపారు. అజాద్ పొత్తి కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. దుండగులు ఉపయోగించిన వాహనం హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దుండగులు కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కాల్పుల ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించాయి.