పీవీకి భారతరత్న ఎందుకడగటం లేదు?

– కేసీఆర్‌ను ప్రశ్నించిన బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘పీవీ నర్సింహారావుకి భారతరత్న ఇవ్వాలనే అంశం సంగతి తరువాత చూద్దాం. ముందు పీవీ ఘాట్‌కు వచ్చి నివాళి అర్పించమనండి. మోడీ నా దోస్త్‌ అని కేసీఆర్‌ పదేపదే అంటున్నడు కదా..భారతరత్న ఇవ్వాలని ఎందుకు అడగడం లేదు?’ అని సీఎం కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌ ప్రశ్నించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు బండి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ తమిళనాడు సహాయ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ కోశాధికారి శాంతికుమార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడమే కేసీఆర్‌ పని అని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓట్లు చీల్చేందుకే ఆనాడు కేసీఆర్‌ పీవీ జపం చేశారన్నారు. పీవీ ఘాట్‌ ను కూల్చేస్తామని ఓవైసీ అంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

 

Spread the love