సమానంగా ప్రయోజనాలు

– సీఎం కేసీఆర్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమిష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్‌ పండుగ విశ్వ మానవాళికి అందిస్తుందని తెలిపారు. బక్రీద్‌ (ఈదుల్‌ అజ్‌ హా) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను సమస్త జనులకు ప్రజల్లో పెంపొందిస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.
సకల మత విశ్వాసాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని సీఎం అన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగ జమున తహజీబ్‌ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామన్నారు. దేశానికే ఆదర్శవంతమైన లౌకిక ఆధ్యాత్మిక కార్యాచరణ రాష్ట్రంలో అమలవుతుందని తెలిపారు. ఇస్లాం సహా మైనారిటీ మతస్తుల అభివద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని వివరించారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

 

Spread the love