పీడిత వర్గాల పక్షాన పోరాడటమే

– అల్లూరికి నిజమైన నివాళి
– రాబోయే తరాలకు ఆయన ఓ స్ఫూర్తి : 125వ జయంతి ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– త్యాగానికి మారు పేరు : గవర్నర్‌ తమిళిసై

– గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చారు : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పీడిత వర్గాల హక్కుల కోసం, వారి పక్షాన పోరాడటమే స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు మనమిచ్చే నిజమైన నివాళి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామారాజు 125వ జయంతోత్సవ ముగింపు వేడుకల్లో ద్రౌపదిముర్ముతో పాటు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. వర్చువల్‌ విధానంలో భీమవరంలోని అల్లూరి విగ్రహాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అల్లూరి జీవితాన్ని ఒక జాతి, వర్గం ఆధారంగా పరిగణించలేమనీ, దేశం కోసం, ప్రజలందరి కోసం పోరాడిన ఆయన్ను దేశవాసులు సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆయన ప్రజల సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా మార్చుకోవడం ద్వారా ఆదర్శప్రాయుడయ్యారని చెప్పారు. ఆయన ఆదర్శాలను ఆచరించడమే నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని సూచించారు. బ్రిటీష్‌ పాలకుల అన్యాయపూరితమైన శాసనాలకు, అధికారాలకు వ్యతిరేకంగా అల్లూరి నిలబడ్డారని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘అల్లూరి రాబోయే తరాలకు స్ఫూర్తి నింపారు. బ్రిటీష్‌ వారిని పదే పదే ఓడించారు. హింసించినా, ఒత్తిడి తెచ్చినా లొంగలేదు. ప్రజలపై దాడులకు వ్యతిరేకంగా నిలబడి ప్రాణాలను అర్పించారు. ప్రజలకు అధికారం కావాలని నిలబడ్డవానిగా చరిత్రలో నిలిచారు. ప్రజల స్వాభిమానం కోసం పరితపిం చారు… ‘ అంటూ రాష్ట్రపతి కొనియాడారు. ఆయన జీవితమే స్ఫూర్తిగా వచ్చిన ఒక తెలుగు సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగువీర లేవరా…. దీక్షబూని సాగరా’ అనే పాటలో ఉన్నట్టు ప్రజలు మేల్కొని ముందుకుసాగాలని ఆమె పిలుపుని చ్చారు. దేశాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. గొప్ప త్యాగాలతో గొప్ప విజయాలు సాధ్యమవుతాయనీ, అలాంటి గొప్ప త్యాగధనుడు అల్లూరి అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కొనియాడారు. ఆయన సామాజిక న్యాయం కోసం నిలబడ్డారని తెలిపారు. గిరిజనుల స్వేచ్ఛ, సంస్కృతి, హక్కులు, ఆకాంక్షల కోసం అల్లూరి అనేక చేశారని గుర్తుచేశారు. బలహీనులైన గిరిజనులను ఆయన ధైర్యవంతులుగా మార్చారన్నారు. ఆయన కేవలం ప్రేరణనిచ్చిన వాడు మాత్రమే కాదనీ….ప్రజలను సమీకరించి బ్రిటీష్‌ పాలకులపై యుద్ధం ప్రకటించారని చెప్పారు. అత్యంత సాహసవంతులైన స్వాతంత్య్రసమరయోధులు, విప్లవకారుల్లో అల్లూరి ఒకరనితెలిపారు. ప్రజలు పీడనకు గురైన పరిస్థితుల్లో దైవాంశసంభూతులు జన్మిస్తారన్న శ్రీకృష్ణుని మాటలు అల్లూరి సీతారామరాజు జీవితానికి వర్తిస్తాయని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి గొప్ప స్ఫూర్తిని రగిలించారని అన్నారు. అల్లూరి స్ఫూర్తిని తెలిపే గీతాలు తెలంగాణ ఉద్యమంలో తనకు స్ఫూర్తినిచ్చాయని గుర్తుచేసుకున్నారు. ‘ విప్లవజ్యోతి, వీరయోధుడు అల్లూరి సీతారామరాజు. మన్నెం బిడ్డల కన్నీరు తుడిచాడు. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు. ఉత్సవాలు ఆయన పోరాట చైతన్యాన్ని, దేశభక్తిని కొత్తతరానికి ఘనంగా చాటిచెప్పాయి. అణగారిన వర్గాలపై ఎప్పుడైతే దాడి సంభవిస్తుందో అప్పుడు కొందరు వీరులు ఉద్భవించి వారికి శాంతి కలుగజేస్తారు. 26 ఏండ్ల వయస్సులోనే అల్లూరి రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాండించారు. భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి యోధుల సరసన, మేమూ తక్కువ కాదంటూ తెలుగు జాతిని నిలబెట్టారు. చనిపోతూ దేశం గురించే మాట్లాడారు. దేశం గురించే ప్రాణాలిడిచారు. అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్మాగాంధీ సైతం అల్లూరిని ప్రశంసించకుండా ఉండలేనంటూ’ చెప్పారని సీఎం గుర్తుచేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, అల్లూరి సీతారామారాజు విగ్రహ రూపశిల్పి బుర్రా ప్రసాద్‌, విగ్రహదాత అల్లూరి సీతారామ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love