ఎకరానికి రూ.10 వేలు..

– పంట సాగు చేసిన రైతులకే సాయం
– కౌలు రైతులనూ ఆదుకుంటాం
– సహాయం కింద వెంటనే రూ.228 కోట్లు విడుదల చేస్తాం
– గతంలో కేంద్రానికి నివేదిక ఇచ్చినా పైసా ఇవ్వలే..
– అందుకే ఈసారి పంట నష్టంపై నివేదిక ఇవ్వం : సీఎం కేసీఆర్‌
– కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పంటల పరిశీలన
– రైతుల పరిస్థితిని వివరించిన సీపీఐ(ఎం),సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు
నవతెలంగాణ- బోనకల్‌(ఖమ్మం)/ వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/ కరీంనగర్‌
అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. కౌలు రైతులు కూడా నష్టపోయారని, వారినీ ఆదుకుంటామని చెప్పారు. ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందిస్తామన్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను గురువారం సీఎం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల పరిధిలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ లింగాల కమల్‌ రాజుతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రావినూతలలోని హెలీప్యాడ్‌ వద్ద కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. మధిర నియోజకవర్గంలో మొక్కజొన్నతోపాటు ఇతర పంటలు బాగా దెబ్బతిన్నాయని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతోపాటు సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు తనకు తెలిపారని అన్నారు. పొలం యజమానికి కాకుండా పంట సాగు చేసిన రైతుకే నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, ఇందుకు అవసరమైన ప్రత్యేక ఆదేశాలను కలెక్టర్‌ విపి గౌతమ్‌కు ఇస్తున్నట్టు తెలిపారు. తాము వ్యవసాయ రంగాన్ని అద్భుతమైన పరిశ్రమగా రూపొందిస్తామని స్పష్టం చేశారు. గతంలో పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపించామని, కానీ బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. అందువల్ల ప్రస్తుతం పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వదలుచుకోలేదని తెలిపారు. రాష్ట్ర రైతులను తమ ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిస్తే ఎవరు వస్తారో.. ఎప్పుడొస్తారో.. ఏమంటారో తెలియదన్నారు. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సిన అవసరం లేదని చెప్పారు. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న 10,9,446 ఎకరాలు, 72,709 ఎకరాలలో వరి, 8,865 ఎకరాలలో మామిడి, 17,238 ఎకరాలలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున అన్నదాతలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేశారని, వారిని తమ ప్రభుత్వం ఆదుకొని తీరుతుందని స్పష్టం చేశారు. వెంటనే ఇందుకు అవసరమైన రూ.228 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కోట్లాది రూపాయలతో పెట్టుబడి పెట్టి ప్రాజెక్టుల నిర్మించామన్నారు. వ్యవసాయ రంగం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుందన్నారు. రైతులను అప్పుల భారం నుంచి బయటపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో జీఎస్‌డీపీ ద్వారా 3 లక్షల 50 వేల తలసరి ఆదాయం వచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం కానివ్వమని, ఈ రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కలిసి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయలేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు చెప్పారు. ఇన్సూరెన్స్‌ ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని, ఆ సంస్థలకే ఉపయోగం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్ధతి చూస్తుంటే ‘చెవిటోడి ముందు శంకువు ఊదినట్టుగా’ ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా పరిపాలన చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో మొక్కజొన్నకు రూ.3,300, వరికి రూ.5,400, మామిడికి రూ.7,200 ప్రకటించిందని, ఇవి ఎవరి ముక్కులో పెడతారని ఎద్దేవా చేశారు. కొంతమంది నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని పంటలకు నష్టపరిహారం ప్రపంచంలో ఏ ప్రభుత్వం చెల్లించలేదని, నష్టపోయిన పంటలకు సహాయ పునరావాస సౌకర్యం కింద మాత్రమే చెల్లించడం జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారని, వారి పరిస్థితి గురించి వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు తనకు వివరించారని అన్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని, నేరుగా వారికే సహాయం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎవరూ నిరుత్సాహానికి గురికావద్దని, ఇది రైతు ప్రభుత్వమని రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
వరంగల్‌, పెద్దవంగరలో సీఎం పర్యటన
వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో సీఎం పర్యటించారు. ఈ గ్రామంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో ఆయన రెండు ప్రాంతాల్లో ముచ్చటించారు. అనంతరం హెలిప్యాడ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన పంట నష్టాల తాలూకు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నష్టపోయిన పంటల వివరాలతోపాటు, దెబ్బతిన్న ఉత్పత్తులను అధికారులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. పంట నష్టానికి ఇంతకు ముందు ఎకరాకు రూ.3 వేలే ఇచ్చేదని, ఈ నష్టం చూశాక రూ.10 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ ప్రకటన హైదరాబాద్‌ నుండే చేయొచ్చు కానీ స్వయంగా పంట నష్టాన్ని చూసి రైతులను ఓదార్చాలనుకున్నానన్నారు. రైతులతో మాట్లాడాలనుకుని ఇక్కడికి వచ్చానన్నారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, పోచారం, వడ్డేకొత్తపల్లి, బొమ్మకల్‌ గ్రామాల్లో వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం స్వయంగా చూసి రైతులను ఓదార్చారు.
 రైతులతో మాటామంతి
కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్‌కు హెలికాప్టర్‌ ద్వారా సాయంత్రం 4గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కడే స్థానిక రైతులతో మాట్లాడారు. వడగళ్లకు నేలరాలిన మామిడి తోటను పరిశీలించారు. నష్టపోయిన రైతులను పలకరించారు. రైతులతో పాటు.. కౌలు రైతులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. దేశంలో ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప… రైతులకు అండగా నిలిచే బీమా సంస్థలు లేవన్నారు. అందుకుతగ్గట్టు కేంద్ర ప్రభుత్వ పాలసీలూ లేవన్నారు. దేశంలో కొత్తగా వ్యవసాయ పాలసీ రావాలన్న సీఎం.. ఇప్పుడు దేశంలో ఒక డ్రామా నడుస్తోందన్నారు. కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే రకంగా ఉందన్నారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉందని, వాళ్ళకు రాజకీయాలు తప్ప ప్రజలు, రైతులు అవసరం లేదన్నారు. నష్టపోయిన పంటల్లో మొక్కజొన్న ఎక్కువగా ఉందని కేసీఆర్‌ తెలిపారు. వీటితో పాటు వరి, మామిడి, ఇతర పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని.. బీభత్సమైన వర్షాలతో పంటలు అనేక చోట్ల తుడిచిపెట్టుకుపోయాయన్నారు. సీఎం పర్యటనలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజరు కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఓఎస్డీ స్మితా సబర్వాల్‌, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love