పింఛన్లు పెంచుతాం

We will increase pensions– తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌
– 50ఏండ్లలో కాంగ్రెస్‌ ఏం చేసింది?
– చత్తీస్‌గఢ్‌, కర్నాటకలో రూ.4వేల పెన్షన్‌ ఎందుకు ఇస్తలేదు?
– ధరణితో రైతుకే అధికారమిచ్చాం
– నల్లగొండలో అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌ రాబోతోంది
– కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటే
– ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి
– సూర్యాపేట ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ-సూర్యాపేట
త్వరలో పింఛన్లు పెంచుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ, కలెక్టర్‌ కార్యాలయాలు ప్రారంభించిన అనంతరం జరిగిన ప్రగతి నివేదన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. సూర్యాపేట జిల్లా కావడం ఒక చరిత్ర అని అన్నారు. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలను అభివద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో 23వ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏండ్లలో కాంగ్రెస్‌ ఏం చేయలేదని, కాంగ్రెస్‌ తన జన్మలో రూ.1000 పెన్షన్‌ ఇవ్వలేదని.. రూ.200 పెన్షన్‌ ముఖాన కొట్టారని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. 4వేలు పెన్షన్‌ ఇస్తామంటున్న కాంగ్రెస్‌.. అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌, కర్నాటకలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఒకరు మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటున్నారని, మరొకరు మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలు అంటున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి తీసేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, ధరణి తీసేస్తే మళ్లీ పాత కథే మొదటి కొస్తుందని, దరఖాస్తులతో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగాలా అని ప్రశ్నించారు. ఒక్కసారి ధరణిలోకి భూమి ఎక్కితే మార్చే అధికారం తనకూ లేదని, రైతు బొటన వేలుకే ఆ అధికారం ఉందని స్పష్టంచేశారు. దశాబ్దాల తరబడి మూసీ మురికి నీరు తాగించారని, ఇప్పుడు నల్లగొండలో అల్ట్రా మెగాపవర్‌ ప్లాంట్‌ రాబోతోందని తెలిపారు. రూ.37 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశామని.. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ఎక్కడా చేయలేదని చెప్పారు. తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తోందని.. త్వరలో పంజాబ్‌ను మించి నాలుగు కోట్ల టన్నుల వడ్లు పండించబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో వలస పోయినవాళ్లంతా వాపస్‌ వచ్చారని గుర్తుచేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గిపోయాయని తెలిపారు. ఒకప్పుడు ఫ్లోరైడ్‌తో ఇబ్బంది పడిన రాష్ట్రం ఇప్పుడు జీరో ఫ్లోరోసిస్‌ స్టేట్‌గా మారిందన్నారు. వీఆర్‌వో వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అందుకే తొలగించామన్నారు. కాళేశ్వరం నీళ్లు.. 480 కి.మీ ప్రయాణించి సూర్యాపేట జిల్లాకు వస్తున్నాయన్నారు. అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధుల మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినట్టేనని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలపించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. సభలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజని కుమార్‌, మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, రమావత్‌ రవీంద్ర నాయక్‌, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌ రెడ్డి, భాస్కర్‌ రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, నోముల భగత్‌, గాదరి కిషోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, కలెక్టర్‌ యస్‌.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికా యుగంధర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.అన్నపూర్ణ పాల్గొన్నారు.
నేడు బీఆర్‌ఎస్‌ తొలి జాబితా
– మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రకటన
– తెలంగాణ భవన్‌లో 105 మంది పేర్లను ప్రకటించనున్న కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించనున్నట్టు సమాచారం. మొత్తం 95 నుంచి 105 మంది అభ్యర్ధుల జాబితాను ఆయన ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మెజారిటీ అభ్యర్థులు సిట్టింగులే కాగా, దాదాపు 8 నుంచి 10 మంది కొత్త అభ్యర్థులు ఉండే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌ తుదినిర్ణయానికి వచ్చేశారనీ, టిక్కెట్‌ రాని సిట్టింగులకు ఎమ్మెల్సీలు లేదా కార్పొరేషన్ల చైర్మెన్ల పోస్టులు వంటివి ఇస్తామని ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నదని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుత సిట్టింగ్స్‌లో దాదాపు 20 నుంచి 22 మందికి ఈ సారి టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితులు లేవని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారని వారు గుర్తుచేస్తున్నారు. మారిన రాజకీయ సమీకరణాలు, సిట్టింగుల పనితీరు, అవినీతి, అక్రమాల అరోపణలు, భూ కబ్జాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొనే ముఖ్యమంత్రి వారికి టిక్కెట్లు నిరాకరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. టిక్కెట్ల కోసం ఇప్పటికే ప్రగతిభవన్‌ చుట్టూ నేతల ప్రదక్షిణలు కొనసాగుతున్నాయి. ఈ తాకిడి తట్టుకోలేకే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అమెరికా వెళ్లిపోయారు. ఇక్కడి పరిస్థితులు కాస్తో కూస్తో సద్దుమణిగాక, ఓ వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఈలోపు స్థానికంగా బుజ్జగింపులు, సర్దుబాట్లు చేసుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. టిక్కెట్లు రాని సిట్టింగులకు పార్టీ అధిష్టానం ఇప్పటికే సమాచారం ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో అసంతృప్త నేతలకు ప్రగతిభవన్‌ గేట్లు తెరుచుకుంటాయో లేదో అనే చర్చ ఇప్పుడు కొనసాగుతుంది.

Spread the love