రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన

– అది ఢిల్లీ వరకు పాకింది
– దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం
– వరంగల్‌ సభలో ప్రధాని మోడీ
రూ.6,100 కోట్ల పనులకు వర్చువల్‌లో శంకుస్థాపన
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే సీఎం కేసీఆర్‌ పని అని, కేసీఆర్‌ కుటుంబం అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. శనివారం హన్మకొండ జిల్లాలో ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా రూ.6,100 కోట్లతో రైల్వే వ్యాగన్‌ పరిశ్రమ, జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానం నుంచి వర్చువల్‌ పద్ధతితో ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత అధికారుల సమావేశంలో మాట్లాడిన అనంతరం మోడీ విజయసంకల్ప సభలో ప్రసంగించారు. సభాస్థలిలో వున్న ప్రజలను చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి నిర్ణయించు కున్నట్టు కనిపిస్తుందన్నారు. అభివృద్ధి కోసం పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని, కానీ అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు కలిసి పనిచేయడం తొలిసారిగా చూస్తున్నానన్నారు. మోడీ ప్రసంగంలో ఎక్కడా నేరుగా సీఎం కేసీఆర్‌ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేయటం గమనార్హం. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయని చెప్పారు. కేసీఆర్‌కు కేవలం నాలుగు పనులే తెలుసన్నారు. ఉద యం నుంచి సాయ ంత్రం వరకు మోడీని తిట్టడం, కుటుంబ పార్టీని పెంచి పోషించడం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, తెలంగాణను అవినీతిలో కూరుకు పోయేలా చేయడమని విమర్శించారు. మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ట్రైలర్‌ మాత్రమేనని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేసి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా అవినీతి లేకుండా జరగడం లేదన్నారు. 3 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగానే వున్నాయని, పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేస్తున్నారన్నారు. టీఎస్‌పీఎస్‌సీ కుంభకోణంతో నిరుద్యోగుల ఆశలను వమ్ము చేశారన్నారు. ఇలాంటివి చూసేందుకేనా యువత బలిదానాలు చేసింది ? అంటూ ప్రశ్నించారు. అవినీతిపై దృష్టి సారించకుండా ప్రజల దృష్టిని కేసీఆర్‌ మళ్లిస్తున్నారని విమర్శించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమైందన్నారు. ప్రపంచ దేశాలకు హైదరాబాద్‌ లోనే వ్యాక్సిన్‌ రూపొందించి అందించడం జరిగింద న్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు. కాజీపేటలో వ్యాగన్‌ తయారీ కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందన్నారు.
జాతీయ రహదారులు 5 వేల కిలోమీటర్లకు పెంపు
తెలంగాణలో జాతీయ రహదారులను 2,500 కిలోమీటర్ల నుంచి 5 వేల కిలోమీటర్ల మేరకు పెంచామని మోడీ అన్నారు. శనివారం రూ.6,100 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండిస్టీయల్‌ కారిడార్‌లు, ఎకనామికల్‌ కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నామ న్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో దేశం రికార్డులు సృష్టిస్తుందని చెప్పారు.
తెలంగాణలో రహదారుల కనెక్టివిటిని పెంచుతున్నామన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుటుంబ పార్టీలని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆ రెండింటిని ఓడించి వాటి అడ్రస్‌ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు.
మద్దతు ధరపై ఇచ్చిన హామీని నిలబెట్టాం
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, సర్పంచ్‌లంతా ఆగ్రహంతో వున్నారని మోడీ అన్నారు. గ్రామీణాభివృద్ధికి నేరుగా నిధులు అందించాలనే కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లను పంచాయతీలకు ఇచ్చినట్టు చెప్పారు. కనీస మద్దతు ధరపై హామీని నిలబెట్టుకున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, పేదలను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఇచ్చామన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆరు లైన్ల రహదారులను నిర్మిస్తున్నామన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ? అని ప్రశ్నించారు.
రూ.1.10 లక్షల కోట్ల ప్రాజెక్టులు : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ
తెలంగాణ రాష్ట్రంలో రూ.1.10 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టామని, ఇందులో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని పురోగతిలో వున్నాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పీఎం గతిశక్తి ద్వారా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.
2024 నాటికి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాది, దక్షిణాదిని అనుసంధానిస్తూ రహదారులు నిర్మిస్తున్నామన్నారు. సూరత్‌ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, కర్నూలు మీదుగా రహదారులు నిర్మిస్తున్నామన్నారు.
ఎందుకు బహిష్కరిస్తున్నవ్‌ కేసీఆర్‌..? : మంత్రి కిషన్‌రెడ్డి
ప్రధాని సభను ఎందుకు బహిష్కరిస్తున్నవో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. కాజీపేటలో వ్యాగన్‌ పరిశ్రమ ఏర్పాటు చేసి 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు సభను బహిష్కరించావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచి రెండు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించినందుకు బహిష్కరిస్తున్నావా ? సమాధానం చెప్పాలన్నారు. ముందు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలన్నారు.
అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు
తొలుత ప్రధాని ఉదయం 10.15 గంటలకు మామునూరు ఎయిర్‌ స్ట్రిప్‌లో హెలికాప్టర్‌ దిగారు. అక్కడి నుంచి నేరుగా భద్రకాళి దేవాలయం చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానానికి 11.15 గంటలకు చేరుకున్నారు. రూ.521 కోట్లతో తలపెట్టిన కాజీపేట రైల్వే వ్యాగన్‌ తయారీ కేంద్రానికి, రూ.2,147 కోట్లతో తలపెట్టిన జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌ ఇంటర్‌ కారిడార్‌లోని 68 కిలోమీటర్ల కరీంనగర్‌-వరంగల్‌ (ఎన్‌హెచ్‌ 563) నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి, నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌లో 108 కిలోమీటర్ల మేరకు మంచిర్యాల-వరంగల్‌ మధ్య రూ.3,441 కోట్లతో తలపెట్టిన నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు.
బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌, మాజీ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌, జాతీయ ఉపాధ్యక్షులు డికె.అరుణ, ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ లక్ష్మణ్‌, ఎంపీలు బండి సంజరు, ధర్మపురి అరవింద్‌, సోయం బాబురావు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు.

Spread the love