మోడీ సభకు ముగ్గురు నేతల డుమ్మా

– కనిపించని వివేక్‌, విజయశాంతి, చంద్రశేఖర్‌
– ఎడమొఖం, పెడమొఖంగానే ఈటల, బండి
– స్టేజీపైకి పిలవకపోవడంతో అలిగిన పలువురు నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో కలహాల కాపురం అట్లాగే కొనసాగుతున్నది. ప్రధాని పర్యటన కూడా నేతలను ఒక్కతాటిపైకి తేలేకపోయింది. సభావేదికపై నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉండటం స్పష్టంగా కనిపించింది. దానికి మించిన బిగ్‌ ట్విస్ట్‌ ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ముగ్గురు కీలక నేతలు డుమ్మా కొట్టారు. అందులో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ప్రధాని సభలో ఎక్కడా కనిపించలేదు. వీరు త్వరలో పార్టీ మారబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. బండి సంజరుని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడాన్ని ఆమె బాహాటంగానే ఖండించారు. బండిని తప్పించడం, ఈటలకు ప్రాధాన్యత ఇవ్వటంతో వివేక్‌ కూడా కొద్దిరోజులుగా అలకపాన్పు ఎక్కారు. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ కూడా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే బాధలో ఉన్నారు. త్వరలో వీరిలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోబోతున్నారనీ, ఒకరు కారెక్కబోతున్నారనే ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతున్నది. ప్రధానమంత్రి సభకు హాజరుకాకపోవడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది.
మరోవైపు జిల్లాస్థాయి నేతల్లో కూడా కొందరు గైర్హాజరు అయినట్టు ప్రచారం జరుగుతున్నది. కిషన్‌రెడ్డి అధ్యక్ష పీఠం ఎక్కాక అందర్నీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తారనీ, ఇక గ్రూపు తగాదాలుండవని భావించిన అధిష్టానానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే. ప్రక్షాళనలో భాగంగా కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినా, పార్టీ వీడకుండా ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ పదవి కట్టబెట్టినా… చివరి నిమిషం వరకూ కాంగ్రెస్‌ గూటికి చేరకుండా అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రమోట్‌ చేసినా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. ఆధిపత్యపోరు రగులుతూనే ఉన్నది. మేమంతా ఒక్కతాటిపై ఉన్నామని కిషన్‌రెడ్డి, ఈటల చెబుతున్నా…కిషన్‌రెడ్డి తమ గురువు అని బండి ప్రబోధిస్తున్నా లోలోన అంతర్గత పోరు నడుస్తూనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఈటల రాజేందర్‌, బండి సంజరు ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. రఘునందన్‌రావుదీ అదే పరిస్థితి. వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చింతా సాంబమూర్తిని వేదికపైకి పిలవకపోవడమూ వివాదాస్పదమైంది. తన నియోజక వర్గంలో జరుగుతున్న సభలో తనను వేదికపైకి పిలవకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడు కుంటున్నాయి. పదవుల పంపిణీ నేతల మధ్య ఐక్యతను తేకపోగా మరింత వైషమ్యాలను పెంచి పోషించినట్టు స్పష్టంగా అర్ధమవుతున్నది.
మరోవైపు కరీంనగర్‌లో బండి సంజరుకు వ్యతిరేకంగా అసంతృప్త సీనియర్ల వరుస సమావేశాలు, దుబ్బాకలో పాత, కొత్త గ్రూపులుగా విడిపోయిన తీరు స్పష్టంగా కనిపి స్తున్నది. వివేక్‌, విజయశాంతి, చంద్ర శేఖర్‌ మాత్రమే కాకుండా రాజ గోపాల్‌రెడ్డి, పలువురు కీలక నేతలు పక్కపార్టీలవైపు చూస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

Spread the love