– వై కేటగిరీ భద్రత కల్పించనున్న కేంద్రం!
– అలర్ట్ అయిన రాష్ట్ర సర్కారు
– భద్రత పెంచాలని పోలీసులకు డీజీపీ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హస్తినలో రెండు, మూడు రోజుల పాటు హాట్‌హాట్‌గా సాగిన తెలంగాణ రాజకీయాలు మళ్లీ ఈటల రాజేందర్ వైపు తిరిగాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌లకు దిగటంతో ఒక్కసారిగా వేడెక్కిన రాష్ట్ర రాజకీయం ఈటల జమున ప్రెస్‌మీట్‌తో మరోమలుపు తీసుకున్నది. కౌశిక్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందనీ, రూ.20 కోట్ల సుపారీ కూడా ఇచ్చారంటూ ఆమె చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. కౌశిక్ రెడ్డి కూడా ప్రెస్‌మీట్ పెట్టి ఆయన్ను చంపించాల్సిన అవసరం తనకు లేదనీ ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ భద్రత పెంపు విషయమూ రాజకీయ రంగు పులుముకున్నది. బీజేపీలోకి పోయాక రాజకీయంగా ఒంటరై క్రమంగా గ్రాఫ్ పడిపోతున్న క్రమంలో పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకునేందుకు ఈటల ‘సుఫారీ’ ఎత్తుగడను ఎత్తుకున్నారా? రాజకీయ లబ్ది కోసం ఇలాంటి వ్యాఖ్యలను జమునతో చేయించారా? నిజంగానే బీఆర్‌ఎస్ నేత కౌశిక్‌రెడ్డి రాజకీయంగా టార్గెట్ చేశారా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కొద్దిరోజులుగా కాంగ్రెస్ హడావిడితో సాగుతున్న మీడియా, ప్రజల దృష్టి అంతా ఇప్పుడు ఈటలపై పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసిందనీ, కేంద్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ ఒకటెండ్రు రోజుల్లో ఉత్తర్వులు కూడా తీసుకురాబోతున్నదని ప్రచారం ఊపందుకున్నది. అయితే, ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందిస్తూ..ఈటల తమ పార్టీలో చాలా ఏండ్ల పాటు పనిచేశారనీ, అలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి వార్తలు రావడం సరిగాదని చెప్పుకొచ్చారు. ఒకడుగు ముందుకేసి రాజేందర్‌కు భద్రత పెంచే విషయంపై ఐపీఎస్‌ను పంపి పర్యవేక్షించాలని డీజీపీ అంజనీ కుమార్‌ను ఆదేశించారు. దీంతో బుధవారం మేడ్చెల్ డీసీపీ సందీప్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈటల ఇంటికి వెళ్లారు. భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇదే రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నది. ఈటల అంటేనే భగ్గుమంటున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుని ఈటల పట్ల సానుకూలంగా మాట్లాడటం కొత్త ఊహాగాహానాలకు తెరలేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భద్రతను స్వీకరిస్తారా? కేంద్రం ఇచ్చే భద్రతాదళతంతో ముందుకెళ్తారా? అనేది ఈటల చేతుల్లోనే ఉంది.
నాకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-రఘునాథపల్లి
సైకో కౌశిక్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తూ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని, తనకు ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అందుకు ప్రధాన కుట్ర దారి కేసీఆర్ అని ఆరోపించారు. కొన్ని రోజులుగా ఒక సైకో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను తిట్టడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం జరుగుతుందని, దాంతో అతనిపై వరంగల్, కరీంనగర్ సీపీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒక సర్పంచ్‌ని కూడా గతంలో జైలుకు పంపించారని ఆరోపించారు. హుజూరాబాద్, జమ్మికుంట చౌరస్తాల్లో ఎవరు తప్పు చేశారో తెలుసుకుందాం రా అని సవాల్ విసిరారు. నీతి నిజాయితీ ఉంటే ప్రతి అంశంపై దర్యాప్తు చేసి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీపీలను కోరారు. ఈటల రాజేందర్ తెరిచిన పుస్తకం అని, ఎవరికి ఎలాంటి హామీ చేయలేదని తెలిపారు గతంలో మాజీ నక్సలైట్ నహీం సాంబశివుని చంపినప్పుడు 100 సార్లు నన్ను హెచ్చరించారని, అయినా భయపడలేదని, ఇలాంటి వారికి కూడా తాను భయపడనని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ సైనికులు డాక్టర్ మాచర్ల బిక్షపతి, నాయకులు కట్ల సదానందం, పిట్టల కుమార్, మారబోయిన సుధీర్ తదితరులు పాల్గొన్నారు.