కరీంనగర్ లో హోరా హోరి ….

– ప్రచారంతో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు
– అగ్రనేతల బహిరంగ సభలు…
– ఎండలు ఠారెత్తిస్తున్నా వెనక్కి తగ్గని నేతలు …
– గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు …

నవతెలంగాణ – భగత్ నగర్: కరీంనగర్ లో పార్లమెంటరీ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య పోర హోరా హోరిగా మారింది. గెలుపే ప్రధానంగా పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లోక్ సభ పరిధిలోని జమ్మికుంట, సిరిసిల్ల కేంద్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో బహిరంగ సభలు నిర్వహించింది. అంతే కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ల పేరిట ప్రచారం నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా , అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. స్థానిక ఎంపీ బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేక మైంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19సార్లు ఎన్నికలు జరుగగా 9సార్లు కాంగ్రెస్, ఉపఎన్నికలతో కలిపి 4సార్లు బీఆర్ఎస్, 3సార్లు బీజేపీ, ఒకసారి టీడీపీ, మరోసారి తెలంగాణ ప్రజా సమితి గెలిచాయి.‌


 పోటాపోటీగా… మూడు పార్టీలు…
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 16,37,138మంది ఉన్నారు. అందులో 8,49,478మంది పురుషులు, 8,80,142మంది మహిళలు, 64మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. బీజేపీ హుజూరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. హుజూరాబాద్, కరీంనగర్‌లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 13,76,685 ఓట్లు పోల్ కాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కు 5249 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్‌కు 5,17,601 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 5,12,352ఓట్లు, బీజేపీకి 2,50,400 ఓట్లు లభించాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ నేత బండి సంజయ్‌కు2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4,98,276 ఓట్లు లభించగా నాలుగున్నర ఏళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 2.50లక్షల ఓట్లే దక్కాయి.

రాజకీయ ఉద్దండుల అందించిన నియోజకవర్గం…
తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి2004లో కాంగ్రెస్ మద్దతుతో తొలిసారి ఎంపీగా గెలుపొంది కేంద్ర కార్మిక మంత్రిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యూపీఏ సర్కార్ నుంచి బయటకు వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి2లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిస్తూ మరోసారి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉద్యమ బిడ్డగా2008 ఉప ఎన్నికలో కేసీఆర్‌ను మరోసారి కరీంనగర్ ప్రజలు గెలిపించి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పారు. 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ 52వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్‌పై గెలిచారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌లో పొన్నం తన వాణి వినిపించి పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యారు. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్ ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై వినోద్ కుమార్ 2.05లక్షల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేయగా బీఆర్ఎస్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 89,508 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం 1.79లక్షల ఓట్లు పొంది మూడో స్థానానికి పరిమితమయ్యారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్‌ (Bandi sanjay kumar) మరోసారి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌ను (Boianapalli Vinod Kumar) బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. అనూహ్య పరిణామాల మధ్య వెలిచాల రాజేంద్రరావును (Velichala Rajender Rao) ఎంపిక
చేసింది.

  • 1952 (ద్వి) బద్దం ఎల్లారెడ్డి పీడీఎఫ్, ఎం.ఆర్.కృష్ణ (ఎంసీఎఫ్)
  • 1957 (ద్వి) ఎం.ఆర్.కృష్ణ, ఎం.శ్రీరంగారావు (కాంగ్రెస్)
  • 1962, 1967 జె.రమాపతిరావు (కాంగ్రెస్)
  • 1971 ఎం.సత్యనారాయణరావు (తెలంగాణ ప్రజా సమితి)
  • 1977, 1980 ఎం.సత్యనారాయణరావు (కాంగ్రెస్)
  • 1984, 1989,1991 జువ్వాడి చొక్కారావు (కాంగ్రెస్)
  • 1996 ఎల్.రమణ (టీడీపీ)
  • 1998, 1999 చెన్నమనేని విద్యాసాగర్‌రావు (బీజేపీ)
  • 2004 కె.చంద్రశేఖర్‌రావు (బీఆర్ఎస్)
  • 2009 పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
  • 2014 బి.వినోద్‌ (బీఆర్ఎస్)
  • 2019 బండియ సంజయ్‌కుమార్‌ (బీజేపీ)

    రసవత్తరంగా రాజకీయం
    కరీంనగర్ ఓటర్ల నాడీ అంతు చిక్కకుండా ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ గెలిస్తే జరిగే ప్రయోజనాలు, అందించే పథకాలు, చేసిన అభివృద్ధి, చెయ్యబోయే కార్యకమాలను వివరిస్తున్నారు . ఎండలు ఠారెత్తిస్తున్న తగ్గేదేలేఅనే రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తూ రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి .

 

Spread the love