– గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
– జెండా పండుగకు సర్వం సిద్ధం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రం ముస్తాబైంది. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోనూ మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవి స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు కూడా కావటంతో ప్రభుత్వం వీటిని ఉత్సాహపూరిత వాతావరణంలో స్ఫూర్తిదాయకంగా నిర్వహించా లంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉదయం 8.30 గంటలకు సచివాలయంలో జాతీయ జెండాను ఎగరేస్తారు. ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. దాంతోపాటు తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో కూడా ఉదయం 9 గంటలకు ఆయన జెండాను ఎగరేస్తారు. అంతకుముందు సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సీఎం సైనిక అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్… రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆమె ఆహ్వానించారు.
పంద్రాగస్టును పురస్కరించుకుని గోల్కొండ కోట, అసెంబ్లీ, సచివాలయం, గన్‌పార్కు, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, చార్మినార్, పబ్లిక్ గార్డెన్, శాసనసభ, మండలి సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. గోల్కొండ కోటతోపాటు సచివాలయంలోని ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్… సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో నిర్వహించే సభను వీక్షించేందుకు 14 పెద్ద పెద్ద ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,930 వాహనాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. వేడుకల సందర్భంగా సోమవారం గోల్కొండ కోటలో పోలీసు, అటవీ, ఫైర్ తదితర శాఖలకు చెందిన వివిధ దళాలు పూర్తి డ్రెస్ రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. మరోవైపు జిల్లాల్లోని కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు సైతం వేడుకలకు ముస్తాబయ్యాయి. హైదరాబాద్‌లోని వివిధ పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే సెమినార్‌లో ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ హరగోపాల్ ప్రసంగిస్తారు.