మహిళలకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

నవతెలంగాణ – సిద్దిపేట

నిర్మల్ సభలో మహిళలకు రూ 2500, సంవత్సరంలో రూ 30వేలు 6 గ్యారంటీ పథకాలలో భాగంగా బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పడం రాష్ట్ర మహిళలను మోసగించినట్లేనని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.  ఆదివారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ని చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ 6 గ్యారెంటీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గ్యారెంటీలు అమలవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, నేను ఒక గ్యారెంటే అమలైందని అంటున్నానని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. మహిళలకు, రైతు భరోసా, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి పథకాలను అమలు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని, ఇందులో గృహజ్యోతి పథకం ఒకటే పాక్షికంగా అమలవుతుందని అన్నారు. ప్రచారం కోసం మీ వద్దకు వచ్చే పార్లమెంట్ అభ్యర్థులను, కాంగ్రెస్ మంత్రులను, నాయకులను మహిళలు, యువకులు, రైతులు, కౌలు రైతులు, విద్యార్థులు తమ పథకాలు అమలు అవుతున్నాయని ఎక్కడ అమలవుతున్నాయో ప్రశ్నించాలని కోరారు.
రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయితే అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ రాంగ్ గాంధీ అయ్యాడని అన్నారు. రాహుల్,  రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.  ఇయ్యని హామీలు ఇస్తునమ్మని రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని అన్నారు.  వంద రోజులలో అమలు చేయనందుకు రాహుల్ గాంధీ బేషరతు గా క్షమాపణ చెప్పాలని,  అప్పుడే ఓట్లు అడగాలన్నారు. మోడీ నల్లధనం తెస్తామని వారు అబద్ధం ఆడారని అన్నారు.  కాంగ్రెస్ అంటేనే కుట్ర, కపట నితి అని అన్నారు.  రాహుల్ తన స్థాయిని కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  భారత దేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ పేదరికం కు కాంగ్రెస్ పార్టీ కారణమని, ఇందిరాగాంధీ గరీబి హటావో నినాదం ఇచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదరికం ఉండదని అంటున్నారని, పేదరికానికి కాంగ్రెస్, బిజెపి కారణమన్నారు. 6 గ్యారంటీలు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని, బహిరంగ చర్చకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు  సంపత్ రెడ్డి, గుండు భూపేష్, రెడ్డి ప్రభాకర్ రెడ్డి, దువ్వల మల్లయ్య, సోమిరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love