పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

– సమ్మెను విరమింపజేయాలి : సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామపంచాయతీ సిబ్బందికి సంబంధించిన న్యాయమైన సమస్యలను పరిష్కరించాలనీ, తద్వారా వారి సమ్మెను విరమింపజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది స్వీపర్లుగా, పారిశుద్ధ్య కార్మికులుగా, పంప్‌ ఆపరేటర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా, కారోబార్లుగా, బిల్‌ కలెక్టర్లుగా వివిధ కేటగిరిల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వారంతా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన పేదలేనని పేర్కొన్నారు. వారి ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా గ్రామాలను శుభ్రం
పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని వివరించారు. దీర్ఘకాలికంగా పెండిరగ్‌లో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు సమ్మె నోటీసును ఇచ్చారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిం చారు. దీంతో జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల ఆరు నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య పనులన్నీ నిలిచిపోయి గ్రామాలు చెత్తా, చెదారం, దుర్గంధంతో కంపుకొడుతున్నాయని పేర్కొన్నారు. వర్షాకాలం కాబట్టి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని వివరించారు. గత్యంతరం లేక స్వయంగా సర్పంచ్‌లే చెత్త సేకరణ లాంటి పనులు చేసే దుస్థితి వచ్చిందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గమనించి కొన్ని గ్రామపంచాయతీ పాలకమండళ్లు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక్కరి పేరుతో వచ్చే రూ.8,500ల అతి తక్కువ వేతనాన్ని ఇద్దరు ముగ్గురు సిబ్బంది పంచుకుంటున్నారని వివరించారు. ఈ క్రమంలో తక్కువ వేతనంతో, అత్యంత దీనస్థితిలో వారు బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం, పీఎఫ్‌, ఆరోగ్య బీమా, గ్రాట్యూటీ, సెలవులు, గుర్తింపు కార్డుల సౌకర్యం లేదని తెలిపారు. చనిపోయిన సిబ్బందికి కనీసం అంత్యక్రియల ఖర్చు, ఆర్థిక సహాయం కూడా అందించడంలేదని పేర్కొన్నారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి వారికి న్యాయం చేస్తుందని ఎంతో ఆశతో చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని సీఎంకు తెలిపారు. సమస్యల తీవ్రత రీత్యా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని తమ్మినేని కోరారు.

Spread the love