వరి కొయ్యలు తగలబెడితే జరిమానా: మంత్రి తుమ్మల

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. గురువారం రోజున పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకు పంటల బీమా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, విధి విధానాలు రూపొందించాలని పేర్కొన్నారు. మొదటి విడత పంటనష్ట పరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తయినందున, రెండో విడత (ఏప్రిల్‌), మూడో విడత (మే) జరిగిన పంట నష్ట వివరాలను వేగంగా అందించాలని తుమ్మల అధికారులను ఆదేశించారు. మరోవైపు పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి ఈ నెలాఖరుకు రిపోర్ట్‌ వచ్చేలా చూడాలని సూచించారు. మార్క్ ఫెడ్‌ ద్వారా మక్క, జొన్న, పొద్దు తిరుగుడు పంటల కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సభ్యుల గుర్తింపు, పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు సత్వరమే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.

Spread the love