పార్ట్‌టైం లెక్చరర్లకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించాలి

– సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో పార్ట్‌టైం లెక్చరర్లకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు(సి)గా పదోన్నతులు కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 755 మంది పార్ట్‌టైం లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వారిలో ఓయూలో 427 మంది, కేయూలో 180 మంది, ఎంజీయూలో 28 మంది, టీయూలో 48 మంది, పీయూలో 52 మంది, ఎస్‌యూలో 20 మంది ఉన్నారని వివరించారు. వారందరినీ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ అధ్యక్షతన సెలెక్షన్‌ కమిటీ పార్ట్‌టైం లెక్చరర్లుగా ఎంపిక చేసిందని గుర్తు చేశారు. వర్క్‌లోడ్‌, సరిపడా తరగతుల్లేవనే సాకుతో వారిని పార్ట్‌టైం ప్రాతిపదికనే కొనసాగిస్తున్నారని తెలిపారు. వాస్తవాన్ని పరిశీలిస్తే వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వల్ల పార్ట్‌టైం లెక్చరర్లపై తీవ్ర పనిభారం పెరిగింది తప్ప, తగ్గలేదని పేర్కొన్నారు. వారంతా ఓయూ రూపొందించిన సెలెక్షన్‌ కమిటీ ద్వారానే నియమించబడినందున తగిన అర్హతలన్నీ కలిగి ఉన్నారని వివరించారు. కావున వారానికి 16 గంటల వర్క్‌లోడ్‌ ఉన్నచోట పార్ట్‌టైం లెక్చరర్లుగా పనిచేస్తున్న వారందరికీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (సి)గా పదోన్నతి కల్పించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Spread the love