విద్యుత్‌ సంక్షోభానికి బీఆర్‌ఎస్‌ సర్కారే కారణం

– బండారం బయట పడకుండా ఉండేందుకే కరెంటు లెక్కలను దాస్తున్నారు
– ఉచిత కరెంట్‌ వద్దంటూ ఆనాడు కేసీఆరే చెప్పిండు
– బషీర్‌ బాగ్‌ కాల్పులకు కారణం ఆయనే…
– త్వరలో మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు
– విద్యుత్‌పై విచారణ కోరిన బీజేపీ ఇప్పుడెందుకు మౌనంగా ఉందో?
– అధికారంలోకి రాగానే విద్యుత్‌ అవినీతిపై విచారణ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి బీఆర్‌ఎస్‌ సర్కారే కారణమని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ బండారం బయటపడకుండా రక్షించుకునేందుకే కరెంట్‌ లెక్కలు దాచి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ మోటార్లకు మీటర్లను వ్యతిరేకించిన కేసీఆర్‌… త్వరలోనే మీటర్లు బిగించబోతున్నారని తెలిపారు. విద్యుత్‌ అవినీతిపై గతంలో సీబీఐ విచారణ కోరిన, బీజేపీ నేతలు ఇప్పుడేందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ అవినీతిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీతో కలిసి రేవంత్‌ విలేకర్లతో మాట్లాడారు. రైౖతులకు ఉచిత విద్యుత్‌ కోసం రూ. 16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ సర్కారు చెబుతున్నదనీ, వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తున్నారని పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల ఫామ్‌హౌస్‌లు, భూములున్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా జరుగుతున్నదని తెలిపారు. ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌తో చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఆ పథకం కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిందేనని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్‌ సరఫరా కానప్పుడు..రూ.16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.
విద్యుత్‌ కేటాయింపుల్లో సగం దోపిడీ
సీఎం కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌ పేరుతో ఆ బడ్జెట్‌ కింద కేటాయించిన నిధుల్లో సగం అంటే ఏడాదికి రూ. 8వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 24 గంటల విద్యుత్‌ పేరుతోఆయన ఈ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎక్కడా లేని ధరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేస్తోందని వివరించారు. కేంద్రం చెప్పినా వినకుండా అధిక రేటుకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్‌ గొప్పగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 2.60 పైసలకే విద్యుత్‌ సరఫరా చేస్తామనీ, ప్లాంట్ల నిర్మాణాన్ని విరమించుకోవాలంటూ అప్పటి కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ చెప్పినా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఏ ప్లస్‌ గ్రేడ్‌ ఉన్న డిస్కంలు… కేసీఆర్‌ పాలనలో సీ మైనస్‌కు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం హయాంలో మొదటి పది స్థానాల్లో ఉన్న డిస్కంలు…కేసీఆర్‌ హయాంలో చివరి పది స్థ్థానానికి పడిపోయాయని తెలిపారు.
24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరుతాం
రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ విషయంలో కాంగ్రెస్‌కు ఎలాంటి శశభిషలు లేవని రేవంత్‌ ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరుతామన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఆ విషయాన్ని సెప్టెంబర్‌ 17న ప్రకటిస్తామన్నారు.
పవర్‌ ప్లాంట్ల విషయంలో కేసీఆర్‌ రూ. 45వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారనీ, దోపిడీ చేసి ప్రజలను మోసంచేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆయా టెండర్లను రద్దు చేస్తామన్నారు. అన్ని సబ్‌స్టేషన్ల లాక్‌ బుక్కులను సరెండర్‌ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలంటూ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావును కోరారు. అసలు విషయం బయటపడుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్‌ నిరసనల డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. ‘కరీంనగర్‌ చౌరస్తాలో గుమ్మికింద పందికొక్కు నన్ను ఉరి తీస్తా అని మాట్లాడుతుండు.తాను చంద్రబాబు శిష్యుడినంటున్నారు. మరి కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారు. చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరు నా గురించి మాట్లాడుతారా?’ అని ఎద్దేవా చేశారు. 27.50 లక్షల మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతుందనీ, ఇది నిజం కాదని చెప్పడానికి బీఆర్‌ఎస్‌ నేతల్లో ఎవరోస్తారో చెప్పాలంటూ సవాల్‌ విసిరారు. తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్‌ వాటా కాంగ్రెస్‌ చొరవేనన్నారు. లేకుంటే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పినట్టు తెలంగాణరాష్ట్రంలో చీకట్లు కమ్ముకునేవన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ఆధారంగా విద్యుత్‌ కేటాయించేందుకు అప్పటి కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నేతలు కృషిచేశారని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్థి అనేది తేలిపోయింది
బీఆర్‌ఎస్‌ బుధవారం చేపట్టిన నిరసనలతో ఆ పార్టీకి కాంగ్రెస్సే ప్రత్యర్థి అని తేలిపోయిందని రేవంత్‌ అన్నారు. 104 మంది బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలిందని వివరించారు. సీఎం కేసీఆర్‌ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారని సర్వేల్లో తేలిందని చెప్పారు. అందుకే కేసీఆర్‌ పక్క నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌లో ఇప్పుడున్న సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్‌ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఉచిత కరెంట్‌ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్‌రావు, ఆనాడు విద్యుత్‌ ఉద్యమ సందర్భంగా బషీర్‌బాగ్‌లో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్‌దేనన్నారు. ఊర్లో పెళ్లికి కుక్కల సందడిలాగా పుట్టలో పడుకున్న పాములు బయటకి వచ్చి తనను నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అమెరికాలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు సంధించారని… కాంగ్రెస్‌ పార్టీ విధివిధానాలు తాను క్లియర్‌గా వివరించినట్టు తెలిపారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్‌ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు. ఐటీ మంత్రి అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.’సొంతంగా వ్యవసాయం చేసిన వ్యక్తిని. వ్యవసాయం గురించి పూర్తిగా తనకు తెలుసు. దుక్కి దున్నిన వాడిని. కేటీఆర్‌ లాగా అమెరికాలో బాత్‌రూంలు కడగలేదు.నేను పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌ కొడుకుని కాదు.నేను దళారీ కొడుకును కాను’ అని స్పష్టం చేశారు. తెలుగుదేశం హయంలో జరిగిన బషీర్‌బాగ్‌ కాల్పుల సమయంలో కేసీఆర్‌ ఆ పార్టీలో కీలకంగా ఉన్నారని గుర్తు చేశారు.

Spread the love