– తెలంగాణ, ఆంధ్రాలకు ఆయన
– చేసిందేమీ లేదు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను తమ పార్టీ పూర్తిగా బహిష్కరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గత తొమ్మిదన్నరేండ్లలో తెలంగాణ, ఆంధ్రాకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన దగ్గర్నుంచి ఇప్పటి వరకూ మోడీ తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు మన రాష్ట్రమంటే ఇంత వ్యతిరేకత ఎందుకని ప్రశ్నించారు. గుజరాత్‌లోని దహోడ్‌లో రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయించుకున్న మోడీ… కాజీపేటలో నిర్మించాల్సిన కోచ్ ఫ్యాక్టరీకి మాత్రం మొండి చేయి చూపారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్న హామీ అటకెక్కిందని చెప్పారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. ఇలా రాష్ట్ర విభజన హామీలన్నింటినీ విస్మరించిన ప్రధాని… ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరోవైపు మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే మోడీని దేశ ప్రజలు నమ్మటం లేదని విమర్శించారు.
ధరణి వెబ్‌సైట్ అనేది విదేశీయుల చేతుల్లో ఉందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించటాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీయుల చేతుల్లోనే ఉందంటూ ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్ కింద వేల కోట్లు ఉన్నాయంటూ ఆయన గతంలో ఆరోపణలు చేశారనీ, అందువల్ల రేవంత్‌కు అసలు మతిస్థిమితం లేదని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని ఆయన పల్లెత్తు మాట అనటం లేదని చెప్పారు. రేవంత్ నూటికి నూరు శాతం ఆరెస్సెస్ మనిషని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి 2019లో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పని చేశాయని తెలిపారు. ఆ తర్వాత నిర్వహించిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలూ అదే రకంగా వ్యవహరించాయని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అసలు ఎవరూ నాయకుడిగా గుర్తించటం లేదని ఎద్దేవా చేశారు. ధరణి ద్వారా ప్రజలకు ఒనగూరిన లబ్దిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా త్వరలోనే ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.