పత్తికి ఎర్రతెగులు సోకి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 40వేల పరిహారం ఇవ్వండి

– వ్యవసాయ కమిషనర్‌కు తెలంగాణ రైతు సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గద్యాల జిల్లాలోని నడిగడ్డ ప్రాంత ఎర్ర తెగులు సోకి నష్టపోయిన సీడ్‌ పత్తి విత్తన రైతులకు ఎకరానికి రూ.40వేల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం కోరింది. పంటలకు బీమా సౌకర్యం కల్పించి ప్యాకెట్‌ ధర రూ. 700 ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్‌, గద్వాల జిల్లా అధ్యక్షులు జికే ఈదన్న, ఉపాధ్యక్షులు వివి నర్సింహ, రైతులు శివన్న, అంజనేయులు తదితరుల బృందం…శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ రఘునందన్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ‘జోగులాంబ గద్వాల జిల్లాలోని నడిగడ్డ ప్రాంతంలో గత 30 ఏండ్ల నుంచి బీటీ సీడ్‌ పత్తి పంట 40 వేల ఎకరాలలో సాగుచేస్తున్నారు. 2015-16 సంవత్సరంలో ఎర్ర తెగులు సోకి సుమారు 57 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 2017-18లో రైతులు పంటలు నష్టపోయారు. ఇదే అంశంపై గతంలో తెలంగాణ రైతు సంఘం పోరాటం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కానీ సమస్య పరిష్కరం కాలేదు. ఈయేడాది కూడా ఎర్ర తెగులు వైరస్‌ సోకింది. ఒకొక్క రైతు ఎకరానికి రూ.40వేలు నుంచి రూ.50 వేల దాకా పెట్టుబడి పెట్టి నష్టపోయారు. దీనితోపాటు సీడ్‌ పంటలకు పుప్పొడి రావడంలేదు. దీనిపై సమగ్రమైన విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలి’ అని కోరారు.
డిమాండ్స్‌ :
-సీడ్‌ పత్తి పంటలకు బీమా సౌకర్యం కల్పించాలి
– నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలి.
– సీడ్‌ పత్తి ప్యాకెట్‌ ధర రూ.700/- కు పెంచాలి.
– రైతులకు ఎకరానికి పెట్టుబడి సహాయం రూ. 2 లక్షలు వడ్డిలేని రుణం ఇవ్వాలి
– కాటన్‌ జిన్నింగ్‌ ఖర్చులు కంపెనీలే భరించాలి.
-కంపెనీలు రైతుతో నేరుగా అగ్రిమెంట్‌ చేసుకోవాలి,
– కంపెనీలు, రైతులు, రైతు సంఘాలతో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలి.

Spread the love