మసక బారుతున్న బాల్యం

– శ్రమ దోపిడీ…హక్కుల ఉల్లంఘన
– పేదరికానికి సాక్షులుగా బాల కార్మికులు
– ఉచిత, నిర్బంధ విద్య ఎక్కడ ?
చిన్నారులు ఆడుతూ పాడుతూ,
తుళ్లుతూ కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో గడిపితేనే భవిష్యత్తులో మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. ఎల్లలు లేని మనోవికాశమే బాలల పురోభివృద్ధికి బాటలు వేస్తుంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలలో మనకు కన్పిస్తున్న దృశ్యం ఏమిటి ? వంద కోట్ల మంది బాలలు ఆటపాటలకు, చదువులకు దూరమయ్యారు. కార్మికులుగా మారిన వారి జీవితాలు మసక బారుతున్నాయి. మన దేశంలోనూ బాల కార్మికుల సంఖ్య అధికంగానే ఉండి కలవరపెడుతోంది. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న లక్ష్యం నీరుకారిపోతోంది. పైగా ఆ లక్ష్యం చేరుకోలేనంత దూరంలో ఉండి పోయింది. ప్రస్తుతం దేశంలో 80 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా పని చేస్తూ అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు.
న్యూఢిల్లీ:బాల కార్మిక వ్యవస్థ చిన్నారుల శ్రమను దోచుకునేందుకు, వారి హక్కులను హరించేందుకు దోహదపడటమే గాక.. సామాజిక న్యాయానికీ అవరోధంగా మారింది. బాలలు గౌరవప్రదంగా జీవించే హక్కును కాలరాస్తోంది. మన దేశంలో 1986, 2016 సంవత్సరాలలో బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టాన్ని, 2009లో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించినప్పటికీ దేశంలోని బాలలు అక్రమ రవాణాకు గురవుతూనే ఉన్నారు. విద్యకు దూరమై నిరక్షరాస్యులుగా మిగులుతున్నారు. వారి శారీరక-మానసిక ఆరోగ్యం బలహీనమవుతోంది.చిన్నారులు అందమైన బాల్యాన్ని కోల్పోవడంతో భవిష్యత్తులో నాణ్యమైన మానవ వనరుల పెట్టుబడిని రాబట్టే విషయంలో రాజీ పడాల్సి వస్తోంది.భారత్‌లో బాల కార్మికుల సంఖ్య ప్రస్తుతం అనేక దేశాల జనాభాను దాటి పోయింది. కైలాష్‌ సత్యార్థి ఫౌండేషన్‌, 2011 జనాభా లెక్కల అంచనాల ప్రకారం 2023 నాటికి దేశంలో సుమారు 78 లక్షల మంది బాల కార్మికులు ఉన్నారు. వీరిలో 57 శాతం మంది బాలలు కాగా మిగిలిన 43 శాతం మంది బాలికలు. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగకపోవడంతో బాల కార్మికుల కచ్చితమైన సంఖ్య తెలియడం లేదు.
పేదరికమే కారణం
దేశంలో పేదరికం ఎక్కువగా ఉందనడానికి ప్రత్యక్ష సాక్షులు బాల కార్మికులే. వీరు అల్పాదాయ కుటుంబాలలో మనకు కన్పిస్తుంటారు. ఒక పిల్లవాడు బాల కార్మికుడిగా మారితే అతని తదుపరి తరం కూడా పేదరికంలో మగ్గాల్సి వస్తోంది. వీరు విద్య, ఆరోగ్యం, సామాజిక-ఆర్థిక అవకాశాలు వంటి
విషయాలలో రాజీ పడాల్సి వస్తోంది. జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. సమాన అవకాశాల విషయంలో బాలలకు ఉండే హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. శ్రమ దోపిడీ పెరుగుతోంది. సామాజిక న్యాయం, స్వేచ్ఛా జీవనం కలగా మిగిలిపోతున్నాయి.
అమలుకు నోచుకోని నిర్బంధ విద్య
భారత రాజ్యాంగం ప్రకారం 6-14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. చిన్నారులు పేదలైనా, ధనికులైనా విద్యకు దూరం కాకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశం. అయితే అది అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా బాల కార్మికుల సంఖ్య పెరుగుతోంది. వారి ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోంది. పైగా బడి పిల్లలకు ఉచితంగా బట్టలు, ఆహారం, ఇతర అవసరాలను సమకూర్చడంలో కూడా వైఫల్యం కన్పిస్తోంది. విద్యా రంగంలో పురోభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్నప్పటికీ పిల్లలు పెద్ద సంఖ్యలో మౌలిక విద్యకు దూరమవుతున్నారు.

కోరలు లేని చట్టాలు
మరోవైపు దేశంలో బాల కార్మిక చట్టాలు కోరలు తీసిన పాము చందంగా తయారయ్యాయి. ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ఉపయోగపడడం లేదు. 1986లో వచ్చిన చట్టంతో పోలిస్తే 2016లో వచ్చిన కొత్త చట్టం విద్యా హక్కుకు భంగం కలిగించే ఏ విధమైన పనినీ బాలలతో చేయించరాదని నిర్దేశిస్తోంది. అయితే ఈ చట్టంలో అస్పష్టతలు కన్పిస్తున్నాయి. బాలలతో పని చేయించడానికి కనీస వయసును ఇందులో నిర్ణయించలేదు. ప్రమాదకరమైన వృత్తిలో బాలలు ఉపాధి పొందడాన్ని నిషేధించలేదు. కుటుంబ పనులలో వారిని భాగస్వాములను చేయడంపై కూడా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో ఈ చట్టం అమలు ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
దేశంలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపే విషయంలో చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు లోపించాయని అర్థమవుతోంది. బాలలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించలేని దేశాన్ని విఫల జాతిగా అభివర్ణించాల్సి ఉంటుంది. ఎనభై లక్షల మంది బాలల ప్రాథమిక హక్కులకు భంగం వాటిలుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి దేశంలోని అన్ని విభాగాలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలంటే ముందుగా బాల కార్మికులను గుర్తించాలి. అన్ని విభాగాలు జోక్యం చేసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలి. చిన్నారులకు మంచి జీవనాన్ని అందించినప్పుడే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

 

Spread the love