– అంధకారంలో మిషన్ భగీరథ కార్మికులు
– అతి తక్కువ వేతనాలతో అవస్థలు
– ‘కనీసా’నికి చెల్లుచీటి నెలల తరబడి బకాయిలతో పస్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న అభాగ్యులు
మిషన్ భగీరథ. భారీ తాగునీటి పథకం. భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. రాష్ట్రవ్యాప్తంగా రూ.45 వేల కోట్లతో చేపట్టారు. మంచినీటి సమస్య తగ్గడానికి ఉపయోగపడింది. ఇందులో ఆయా అవసరాల కోసం నియమించిన దాదాపు 16 వేల మంది కార్మికుల బతుకు ప్రస్తుతం అగమ్యగోచరంలో ఉంది. వారి భవిష్యత్ అంధకారాన్ని తలపిస్తున్నది. అడకత్తెరలో పొకచెక్కలా తయారైంది. ఇటు ప్రభుత్వం, అటు కంపెనీలు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి ఏర్పడింది. కనీసం వేతనాలు చెల్లించకుండా ప్రయివేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా పనిప్రదేశాల్లో వసతులను కల్పించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిరుపేద కార్మికులను నిలువు దోపిడి చేస్తున్నాయి. బకాయిలు సైతం చెల్లించకుండా కార్మికుల పస్తులకు కారణమవుతున్నాయి.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ పథకాన్ని అమలుచేయా లంటూ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను దేశంలోని అన్ని రాష్ట్రా లకు పంపించింది. ఇందులో భారీగా ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది పనిచేశారు. అలాగే సుమారు 16 వేల మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులు విధులు నిర్వర్తించారు. ప్రాజెక్టు ప్రధాన పనుల నుంచి ఇంట్రా విలేజ్ నెట్‌వర్క్ వరకు వేగంగా పూర్తికావడానికి సహ కరించారు. ప్రాజెక్టును పూర్తిచేసి ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా మంచిపేరు తెచ్చారు. కానీ, తమకు కావాల్సిన కనీస అవసరాలను నెరవేర్చుకోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
అసలు సమస్యేంటి ?
ప్రాజెక్టులో వేలాదిగా పనిచేసిన కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదు. ఇచ్చేవి సైతం సమయానుకూలంగా రావడం లేదు. స్వయానా ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 11, 60 అమలు కావడం లేదు. జీవో నెంబరు 107 సైతం పెండింగ్‌లోనే ఉంది. మేఘా, ఎల్ అండ్ టీ, రాఘవ, ఎన్‌సీసీ, జీవికే, కెఎల్‌పీఆర్, హెచ్‌పీ తదితర కంపెనీలు మిషన్ భగీరథ పనులు దక్కించు కున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్మికు లందరికీ ఒకేరకమైన వేతనాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఒక్కో కంపెనీలో ఒక్కోరకంగా వేతనాలు ఇస్తు న్నాయి. ఒక్క ఎల్‌అండ్‌టీ లోనే నెలకు రూ.12 వేల వేతనం ఇస్తున్నారు. అది కూడా ఒక్క ఖమ్మంలో మాత్రమే. చట్టబద్దహక్కులేవి అమల్లో లేవు. పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, వారాంతపు సెలవులు అసలే లేవు. ఎనిమిది గంటల పని విధానం ప్రశ్నార్థకమైంది. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో ఆయా కంపెనీలు తీసుకుంటే తమకేమీ సంబంధమని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. పంపు అపరేటర్లు, లైన్‌మెన్లు, ఫిట్లర్లు, ఎలక్ట్రిషియన్లు తదితర కేటగీరీల్లో వీరు పనిచేస్తున్నారు. బాండ్ పేపర్ రాయిం చుకుని బానిసల్లా పని చేయించుకుంటున్నారు. పెరిగే ధరలు, ఇచ్చే జీతాలకు పొంతనే ఉండటం లేదు. కొన్ని కంపెనీలు ఐదు నుంచి ఏడు నెలలు బకాయిలు చెల్లిం చాల్సి ఉంది. పస్తులుండలేక, పిల్లలను చదివించుకోలేక నల్లగొండ జిల్లాకు చెందిన పుష్పలత 17 పేజీల నోట్ రాసి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏడాది క్రితమే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. అలాగే సూర్యాపేటలోనూ మరో కార్మికుడు అసువులు బాశాడు. 2018లో..ప్రతిరోజూ కార్మికులు 40 నుంచి 50 కిలోమీటర్ల పాటు టూవీలర్ల మీద తిరగాల్సి ఉంటుంది. పెట్రోల్ అలవెన్స్ సైతం పక్కన పెట్టేశారు. భద్రతా ప్రమాణాలను కంపెనీలు గాలికొదిలేశాయి. రాత్రిపూట కూడా పనిచేయాల్సి వస్తున్నది. ప్రమాదాలు జరుగుతున్నాయి. కాళ్లు, చేతులు విరిగి వికలాంగులవుతున్నారు. ఇటు కంపెనీలు, అటు ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాయి. 2018లో వీరిని నియమించినా, ఇప్పటికీ కనీస వేతనాలు అందడం లేదు. పనిచేసే ప్రదేశాల్లో సౌకర్యాలు అంతంతే. ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో చేస్తున్న జాప్యం మూలంగా వేతనాలు చెల్లించలేకపోతున్నామని కాంట్రాక్టు కంపెనీలు చెబు తుండటం గమనార్హం. ప్రభుత్వం నుంచి దాదాపు రూ. .2 వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని అంటున్నారు.
కనీస వేతనాలు అమలుచేయాలి
భగీరథ కార్మికులను కనీసం వేతనాలు అమలు చేయడంలేదు. ఇప్పటివరకు మూడుసార్లు ఆందోళన చేశాం. కంపెనీలతో మాట్లాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నది. ప్రభుత్వమే నేరుగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు వీఆర్‌ఏలను భగీరథలోకి తెచ్చారు. కానీ, ఇక్కడున్న కార్మికులను మాత్రం పర్మినెంట్ చేయడం లేదు. ఇది అన్యాయం.
– వంగూరి రాములు, మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)
ఏంచేయాలి ?
కార్మికుల సమస్యలు పరిష్కారం కావా లంటే ప్రభుత్వం చొరవ చేయాల్సి ఉంటుంది. నేరుగా ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ వస్తున్నది. కనీస వేతనం జీవో 60ని అమలుచేయాలి. అన్‌స్కిల్డ్ వర్కర్లకు రూ. 15,600, సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.19000, స్కిల్డ్ వర్కర్లకు రూ.22,600 ఇవ్వాలి. కనీస వేతనమైన రూ.18,400ల్లో ఇప్పుడు కంపెనీలు సగం సైతం చెల్లించడం లేదు. దీంతో వారి జీవనం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా ఉంది.