గూడు..గోడు..!

– విడుదల కాని గృహలక్ష్మిపథకం మార్గదర్శకాలు
– కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్దిదారులు
– స్పష్టతనివ్వని అధికారులు
– సొంతింటి నిర్మాణం కోసం నిరుపేదల ఎదురుచూపులు
– కొనసాగుతున్న తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక ఉద్యమం
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలకిë పథకం మార్గదర్శకాలు ఇంకా విడుదల లేదు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని జీఓ విడుదల చేసిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రం రూపొందించడం లేదు. జులైలో దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేయడంతో లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గ్రామాల నుంచి మహిళలు పెద్దఎత్తున కలెక్టర్‌ కార్యాలయానికి తరలివస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాకపోవడంతో అధికారులు దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఈ విషయం తెలియక గ్రామాల నుంచి నిరుపేదలు కలెక్టరేట్లకు వచ్చి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాల విడుదలలో జాప్యం చేయడం మూలంగా నిరుపేదలు ఇబ్బందులు పడాల్సివస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌
ప్రాంతీయ ప్రతినిధి, ఆసిఫాబాద్‌
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం.. డబుల్‌ బెడ్‌ ఇండ్లూ పంపిణీ చేయకపోవడంతో అనేక ఏండ్ల నుంచి సొంత గూడు లేక నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం గృహలకిë పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణం కోసం రూ.3లక్షలు అందజేస్తామని ప్రకటించింది. ఈ నెల నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని అప్పట్లో స్పష్టం చేసింది. తాజాగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలను ప్రామాణికంగా తీసుకొని అందజేయాలని సంకల్పించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇండ్ల చొప్పున అందజేయాలని భావిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున మూడు విడతల్లో అందజేస్తామని స్పష్టం చేసింది. బేస్‌మెంట్‌, రూఫ్‌లెవల్‌, పూర్తయిన తర్వాత అందజేస్తారు. అయితే, మూడు లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10లక్షలు ఇవ్వాలని సీపీఐ(ఎం), తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక డిమాండ్‌ చేస్తున్నాయి. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేస్తున్నాయి.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో లబ్దిదారులు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వందలాది మంది నిరుపేద మహిళలు తరలివచ్చారు. అక్కడి సిబ్బంది గేట్లు మూసివేసి లోపలికి రానీయకుండా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. నాయకులు, నిరుపేదలు అక్కడే బైటాయించడంతో స్పందించిన కలెక్టర్‌ వారి దరఖాస్తులు తీసుకొని రసీదులు అందించారు. ప్రభుత్వం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తుందా.. ప్రజాప్రతినిధుల ద్వారా తీసుకుంటుందా అనేదానిపై అధికారవర్గాల్లోనూ స్పష్టత లేదు.
వారం రోజుల్లో మార్గదర్శకాలు : బసవేశ్వర్‌, గృహనిర్మాణశాఖ నోడల్‌ అధికారి
ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. కానీ పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అక్కడ్నుంచి ఆదేశాలు రాగానే వాటి ప్రకారం దరఖాస్తుల ప్రక్రియపై చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
పూరి గుడిసెలో నివాసముంటున్నాం
మాకు సొంత ఇల్లు లేదు. పూరి గుడిసెలోనే నివాసముంటున్నాం. ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని తెలియడంతో దరఖాస్తు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లాను. ప్రభుత్వం మాలాంటి పేదలకు ఇల్లు కేటాయించి నీడ కల్పించాలని కోరుతున్నాం.
-పద్మ రాజవేణి, ఖమాస, వాంకిడి మండలం

Spread the love