పేరుకే పెద్దాస్పత్రులు

–  క్యాన్సర్‌ రోగులకు రెఫరల్‌ ఆస్పత్రులే దిక్కు
– కేంద్రం పరిధిలోని దవాఖానాల్లో విచిత్ర పరిస్థితి
– నిధులు, స్థలం ఉన్నా…క్యాన్సర్‌ విభాగానికి దిక్కు లేదు
– రైల్వే సొమ్మూ….కార్పొరేట్‌లకే…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పేరుకు అవి పెద్దాస్పత్రులు. ముఖ్యమైన విభాగాలు మాత్రం ఉండవు. గతంలో అంటు రోగాలతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. పారిశుధ్య నిర్వహణ, ఇతరత్రా తీసుకున్న జాగ్రత్తలతో దాని స్థానంలో అసాంక్రమిత వ్యాధులు (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ -ఎన్‌సీడీ) ఆక్రమించాయి. ఆయా రోగాలతో మరణిస్తున్న వారిలో కార్డియో వ్యాస్కులర్‌ డిసీజెస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాని తర్వాత అత్యధిక అకాల మరణాలకు క్యాన్సర్‌ కారణమవుతున్నది. గత పదేండ్లలో క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య 25 శాతం పెరిగిందంటే రోగులకు పెంచాల్సిన సౌకర్యాల అవసరమెంత ఉందో అర్థమవుతుంది. కేంద్ర కార్మికశాఖ అధీనంలో ఉండే సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీతో పాటు అక్కడి ఆస్పత్రిలో, రైల్వేశాఖ పరిధిలోని లాలాగూడ రైల్వే సెంట్రల్‌ ఆస్పత్రి, కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో గానీ క్యాన్సర్‌కు సంబంధించి ప్రత్యేక విభాగాలు లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా ఈఎస్‌ఐ లబ్దిదారులున్నారు. వీరే కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఇతర రాష్ట్రాల రోగులను కూడా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐకే రెఫర్‌ చేస్తుంటారు. అయితే క్యాన్సర్‌ బారిన పడి వచ్చే రోగులకు ఆధునాతన చికిత్సల కోసం నిమ్స్‌కు రెఫర్‌ చేస్తుంటారు. అయితే ఇప్పటికే చేసిన చికిత్సలకు ఈఎస్‌ఐ సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో నగదు రహిత చికిత్స చేసేందుకు నిమ్స్‌ నిరాకరిస్తున్నది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు క్యాన్సర్‌ విభాగం ఏర్పాటు చేసుకునే స్థలం, కోట్లాది రూపాయల నిధులు, దీనికి తోడు క్యాన్సర్‌ విభాగం ఏర్పాటు చేస్తే వన్‌ టైం గ్రాంట్‌ కింద కేంద్రం ఒకే సారి రూ.130 కోట్లు ఇచ్చే నిబంధన ఉన్నప్పటికీ విభాగం ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు రోగులకు బయట కూడా సకాలంలో చికిత్స దొరికేలా చెల్లింపులు చేయకపోవడం తదితర కారణాలు రోగులకు శాపాలుగా మారాయి. రైల్వే సెంట్రల్‌ ఆస్పత్రి విషయంలోనూ ఇదే రకమైన విమర్శలొస్తున్నాయి. ఆస్పత్రిలో క్యాన్సర్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులున్నప్పటికీ రోగులను కార్పొరేట్‌కు పంపిస్తున్నారనే వాదనలొస్తున్నాయి. రోగులను ఆస్పత్రులకు పంపించి వారికి చెల్లించే డబ్బులు వెచ్చిస్తే సొంతంగా రైల్వే ఆస్పత్రిలో ఆధునాతన క్యాన్సర్‌ విభాగం ఏర్పాటు చేయొచ్చని ఆ రంగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీబీనగర్‌ ఎయిమ్స్‌లోనూ క్యాన్సర్‌ విభాగం లేకపోవడంతో రోగులకే కాకుండా సంబంధిత కోర్సుల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకూ నష్టమే జరుగుతున్నది. వైద్య విద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ దశలో క్యాన్సర్‌ ఒక ఆప్షనల్‌గా మాత్రమే ఉండటంతో ఎయిమ్స్‌ లో ఈ విభాగం ఏర్పాటుపై ఆసక్తి చూపించటం లేదని తెలుస్తున్నది. అయితే భవిష్యత్తులో ఆంకాలజీ (క్యాన్సర్‌) విభాగంలో పీజీ సీట్లు రావాలంటే ఈ విభాగం తప్పనిసరి ఉండితీరాలి.
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ఏది?
గర్భాశయ క్యాన్సర్‌ సమస్య మహిళలను పట్టిపీడిస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్ష మంది మహిళలు కొత్తగా దీని బారిన పడుతుండగా, దాదాపు 60 వేల మంది ప్రాణాలొదులుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. వైద్యపరిశోధనల ఫలితంగా కొన్ని రోగాలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. హ్యూమన్‌ పాపిల్లొ వైరస్‌ వల్ల వచ్చే ఈ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్‌ పరిశోధన ఫలితాలు అందించింది. 12 ఏండ్లు దాటిన యువతులు, మహిళలు ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రయివేటులో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుండటంతో పేద మహిళలు వ్యాక్సినేషన్‌కు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పేద యువతులు, మహిళలను ఆదుకునేందుకు ఆయా ఆస్పత్రుల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తేవల్సిన అవసరమున్నది.
ప్రతిపాదనలు పంపాలి
క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటు కోసం ఆయా ఆస్పత్రుల హెడ్స్‌ ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. వాటిని ఆమోదించాక ఒక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం ఏడాది పట్టొచ్చని ఆంకాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ విభాగం ఏర్పాటుతో రోగులకు ఆధునిక చికిత్సలందడమే కాకుండా వైద్య విద్యార్థులకు పీజీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.

Spread the love