మత సామరస్యం నేపథ్యంలో బుక్‌ ఫెయిర్‌

– నేటి నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం
– 300 పుస్తక దుకాణాలు, రెండున్నర లక్షల పుస్తకాలు
– జ్ఞానవంతులు కావాలంటే పుస్తకాలు చదవాలి
– హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‌
నవతెలంగాణ-కల్చరల్‌
ఈ సారి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పుస్తక ప్రదర్శన మత సామరస్యం నేపథ్యంలో ఉంటుందని, అందుకు తగినట్టు ప్రణాళికలు రూపొందించామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ తెలిపారు. కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల ఐక్యత వర్ధిల్లాలి అంటే సమాజాన్ని నడిపించే రథ చక్రాలైన జ్ఞానవంతులు కావటానికి పుస్తకాలు చదవటం ముఖ్యమన్నారు. జాతీయ పుస్తక ప్రదర్శన గురువారంతో ప్రారంభమై జనవరి 1 వరకు కొనసాగుతుందన్నారు. నేటి నుంచి ఎన్‌టీఆర్‌ స్టేడియంలో (తెలంగాణ కళా భవన్‌)లో 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను రవీంద్రభారతిలోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆయన వెల్లడించారు. పుస్తక ప్రదర్శనకు పది లక్షల మంది వీక్షకులు వస్తారని అంచనా వేశామని చెప్పారు. 300 పుస్తక దుకాణాల్లో రెండున్నర లక్షలకుపైగా పుస్తకాలు పలు సాహిత్యం, భిన్న భాషల్లో లభ్యమవుతాయని, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయుక్తంగా ఉండే పుస్తకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రారంభ వేడుకలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొంటారన్నారు. ప్రజలు పుస్తకాలు చదవటం లేదన్నది వాస్తవం కాదని.. గత కాలం పుస్తక ప్రదర్శనశాలల్లో అమ్మకాలు చూస్తే ఈ విషయం తెలుస్తుందని అన్నారు. పుట్టినరోజు, వివాహం తదితర వేడుకల్లో నాయకులకు, మిత్రులకు, బంధువులకు పుస్తకం బహుమతిగా ఇచ్చే సంప్రదాయం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో రీడింగ్‌ క్లబ్‌లు రావాలని ప్రచారం చేశామని తెలిపారు. అంబేద్కర్‌ స్టడీ సెంటర్‌ ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వర్‌ నిర్వహణలో, వివిధ రచయితల రచనలపై ముఖాముఖి కార్యక్రమం ఈసారి ప్రత్యేకత అని తెలిపారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పుస్తక ప్రదర్శనకు అన్ని విధాల సహకారం అందిస్తోందని తెలిపారు. పుస్తక ప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పుస్తకప్రియులు పండుగగా జరుపుకోవాలని కోరారు. పుస్తక ప్రదర్శన అనేది లాభనష్టాలతో సంబంధం లేకుండా నిర్వహిస్తామన్నారు.
అంబేద్కర్‌ స్టడీ సెంటర్‌ నిర్వాహకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ.. సామాజిక భావనలు ఉన్న గ్రంథాలపై రచయితలతో ముఖాముఖిని 23 నుంచి జనవరి 1 వరకు జరుపుతామని వివరించారు. సమావేశంలో సాహితీవేత్త కోట్ల వేంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

Spread the love