సాయుధ పోరాటంలో ఊరికో చరిత్ర

Uriko's History of Armed Struggle
– ఒకే చితిపై 8 మంది వీరులు
– చెరగని గోవిందాపురం గాథ
– స్ఫూర్తి నింపే స్మృతి గీతాలు మీనవోలు అమరులు
– వీరుల త్యాగాల నెలవు బ్రాహ్మణపల్లి
– బరిగీసి నిలిచిన సిరిపురం యోధులు
– నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి (కె.శ్రీనివాసరెడ్డి)

‘ఉద్యమాల ఊయలగా ఊరు.. నిజాం రాజులను తరిమిన పోరు.. బాంచన్‌ దొర నీ కాల్మొక్కుత అనే బానిసత్వానికి చరమగీతం పాడుతూ మట్టి మనుషులు చేసిన మహా యుద్ధం.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో ఊరుకో రక్త చరిత్ర ఉంది. ఆ కోవకు చెందినదే బోనకల్‌ మండలం గోవిందాపురం ఉదంతం.. రేపల్లెవాడ అమరవీరుల గాథ.. ఒకే చితిపై 8 మంది దహనం అప్పట్లో ఓ సంచలనం. వివరాల్లోకి వెళ్తే..
రేపల్లెవాడ అమరుల గాథ
నిజాం వ్యతిరేక పోరాటంలో గోవిందాపురం నడిబొడ్డులో ఒకే చితిపై 8 మందిని దహనం చేశారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్న నిజాం ముష్కరులు చింతహింసలు పెట్టారు. రేపల్లె వాడ ఊరిబయట వీధుల్లో కాల్చి చంపారు. ఆళ్లపాడుకు చెందిన యనమందుల చంద్రయ్య, తల్లంపాడు వాసి మందా అచ్చయ్య, వల్లాపురానికి చెందిన గొర్రెముచ్చు అజరయ్య, మద్దులపల్లి వాసి మద్దులపల్లి వీరస్వామి, సామినేని గోపయ్య, రేపల్లెవాడ నుంచి తమ్మినేని బుచ్చయ్య, వెంకటయ్య, మద్దిరాములును వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకుని రేపల్లెవాడలో హతమార్చారు. వీరందరినీ గోవిందాపురంలో ఒకే చితిపై వేసి నిప్పుపెట్టారు. గోవిందాపురానికి చెందిన మోటారపు రామచంద్రయ్యను రహస్యాలు చెప్పమని ఇంటికప్పు మీద నుంచి దొర్లించగా మరణించాడు.
ఒకేసారి 8 మంది అంతం..
ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంపై 1948 జనవరి 15న నైజాం రజాకార్లు దాడి చేశారు. గ్రామాన్ని లూఠీ చేసి తగులబెట్టారు. ప్రజలు ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తోట వెంకయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీనివాస్‌, తోట బాలయ్య, రాంపల్లి రామయ్య, సుఖభోగి ముత్తయ్య, పిల్లి కాటయ్య, రాచకొండ వెంకయ్య అశువులు బాసారు. సరిహద్దు గ్రామంలో రూ.లక్షల విలువైన ఆస్తులు దోచారు. ఈ మృతవీరుల జ్ఞాపకార్థం మీనవోలు గ్రామంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. ప్రతియేటా మృతుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు.
పోరుగల్లు బోనకల్లు..
వీర తెలంగాణ సాయుధ పోరాట గడ్డ బ్రాహ్మణపల్లి కమ్యూనిస్టు నాయకులకు తల్లిలాంటిది. సాయుధ పోరాట పులి, దళ కమాండర్‌ గాదె మాధవరెడ్డిని రజాకార్ల ఏజెంట్లయిన రౌడీలు హతమార్చారు. ఆయనతో పాటు పిచ్చిరెడ్డి, నారాయణరెడ్డి, నల్లమల గోపయ్య, పగిడిపల్లి జోగయ్య, అచ్చయ్య, ప్రముఖ దళ నాయకుడు గంగసాని వీరయ్య ఇలా ఏడుగురిని బలిగొన్నారు. వైరా మండలంలో 1947 డిసెంబర్‌ 29న రజాకార్ల కిరాతక దాడిని ఎదురించి నిలిచింది సిరిపురం. రజాకార్ల దాడిలో ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాళ్లూరి అప్పయ్య, బంగా నాగయ్య, మాచా పిచ్చయ్య అమరులయ్యారు. 50 పశువులను రజాకార్లు విచక్షణారహితంగా కొట్టి కొట్టి చంపారు.

Spread the love