గృహలక్ష్మిల గగ్గోలు

– మూడు లక్షల కోసం ముప్పు తిప్పలు
– దరఖాస్తుల కోసం తీరని వెతలు
– అందుబాటులో లేని తహసీల్దార్లు
– ఆదాయ సర్టిఫికెట్‌ కోసం అగచాట్లు
– నేటితో ముగియనున్న మూడురోజుల గడువు
– నిరంతర ప్రక్రియ అంటున్న అధికారపక్ష వర్గీయులు
తేదీ పొడిగించాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు
మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకం కోసం మహిళలు ముప్పు తిప్పలు పడుతున్నారు. దరఖాస్తులకు మూడ్రోజులు మాత్రమే సమయం ఇవ్వడం.. గురువారం నాటితో గడువు ముగుస్తుండటంతో తహసీల్దార్‌ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. చాలా మంది మహిళలకు ఆదాయ సర్టిఫికెట్‌ లేకపోవడంతో ఇప్పటికిప్పుడు దానిని తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు. పలు మండలాల్లో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తమకు లబ్ది చేకూరు తుందో లేదోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం అందు బాటులో ఉన్న ధ్రువీకరణలతో దరఖాస్తు చేస్తే సరిపోతుందని, విచారణ సమయం నాటికి నిర్దేశిత సర్టిఫికెట్లు పొందాలని చెబుతున్నారు. మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియని, దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ ప్రకటించారు. అయినప్పటికీ దరఖాస్తుదారుల్లో టెన్షన్‌ తగ్గడం లేదు. సకాలంలో దరఖాస్తు చేయకపోతే తమను ఎక్కడ అనర్హులుగా పరిగణిస్తారోనని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గడువు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఆందోళనలు జరుగుతున్నాయి. గడువు అంటూ ఏమీ లేదని, ఇదొక నిరంత ప్రక్రియ అని అధికారపక్ష వర్గీయులు అంటున్నారు.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో గృహలక్ష్మి పథకం దరఖాస్తులు వేసేందుకు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఆరుబయట ఏర్పాటు చేసిన ఈ బాక్స్‌లకు ఎలాంటి భద్రతా లేదు. దరఖాస్తులు వేసేందుకు వీలుగా బాక్స్‌లకు రంధ్రం ఉన్నా తాళం వేయకపోవడం, పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుదారులు మూత తీసి అప్లికేషన్‌లను పెట్టెల్లో వేస్తున్న దృశ్యాలు పలుచోట్ల కనిపించాయి.ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వందలాది దరఖాస్తులతో రెండు పెట్టెలు నిండాయి. దరఖాస్తుదారుల అనుమానాలు నివృత్తి చేయడం కోసం బాక్స్‌ల వద్ద ఉండాల్సిన సిబ్బంది ఎక్కడ తిరుగుతున్నారో అర్థంకాని దుస్థితి. దీంతో దరఖాస్తుదారులు పలుచోట్ల గందరగోళానికి గురవుతన్నారు. కొన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే ఈ ప్రక్రియ పకడ్బందీగా సాగుతోంది.
అందుబాటులో లేని తహసీల్దార్లు : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. నూతన తహసీల్దార్లు కొందరు ఇప్పటికీ బాధ్యతలు తీసుకోలేదు. బాధ్యతలు తీసుకున్నవారిలో కొందరు సెలవులు, ఎన్నికలు, జీవో 58 విచారణ తదితర పనుల నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆయా కారణాలతో తహసీల్దార్లు అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో అయోమయ స్థితి నెలకొంది. ముఖ్యంగా ఆదాయ సర్టిఫికెట్‌ విషయంలో ఆందోళన నెలకొంది. గృహలక్ష్మి పథకంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఆయా మండలాల నేతలు తహసీల్దార్‌ కార్యాల యాలకు వస్తున్నారు. వారు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఖమ్మం రూరల్‌, కామేపల్లి, మరికొన్ని మండలాల్లో ఈ పరిస్థితి రెండ్రోజులుగా కొనసాగుతోంది. తహసీల్దార్లు లేనిచోట ఆర్‌ఐలైనా ఉండి సమాధానం చెప్పే పరిస్థితి లేదు.
మార్గదర్శకాల విషయంలోనూ గందరగోళం
మార్గదర్శకాలు, సర్టిఫికెట్ల విషయంలోనూ గందర గోళం నెలకొంది. ప్రభుత్వం, ప్రభుత్వాధికారుల నుంచి ఈ స్కీంపై పూటకో ప్రకటన ఇస్తుండటంతో దరఖాస్తుదారుల్లో గందరగోళ స్థితి నెలకొంది. తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎలక్షన్‌ ఓటర్‌ గుర్తింపు కార్డు ఉంటే చాలనీ, కుల, ఆదాయ ధ్రువీకరణలతో పనిలేదని కొందరు అధికారులు చెబుతు న్నారు. దరఖాస్తుదారుని ఇంటి వద్దకు విచారణ నిమిత్తం వచ్చినప్పుడు సమర్పిస్తే సరిపోతుందంటున్నారు.
ఖాళీ స్థలం దస్తావేజులు, అదే గ్రామానికి చెందిన వారిగా నిరూపించుకునే ఆధారాలు ఉండాలంటున్నారు. బుధవారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రకటనలో మాత్రం గ్రామకంఠంలో ఉన్న పాత ఇండ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్‌ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇలా ప్రభుత్వం, అధికారుల నుంచి వెలువడుతున్న అస్పష్ట ప్రకటనలతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు.
తహసీల్దార్‌ కార్యాలయాలకు పోటెత్తిన అర్జీదారులు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
గృహలకిë పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు పల్లెల నుంచి తహసీల్దార్‌ కార్యాలయాలకు.. వార్డుల నుంచి మున్సిపాలిటీ కార్యాలయాలకు జనాలు పోటెత్తుతున్నారు. రెండ్రోజుల్లో ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 22వేల దరఖాస్తులు వచ్చినట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడు తున్నాయి. గడువు తక్కువగా ఉండటంతో గ్రామాల నుంచి మండల కేంద్రానికి భారీగా తరలివస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. గురువారంతో ఈ ప్రక్రియ ముగియగానే దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో నియోజకవర్గానికి 3వేల మంది లబ్దిదారులకు మంజూరు చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 30వేల మందికి సొంతింటి కల నెరవేరనుంది. మరోపక్క ప్రభుత్వం విధించిన గడువు మరీ తక్కువగా ఉందని.. అందరూ సకాలంలో దరఖాస్తులు చేయలేని పరిస్థితి ఉందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. మరికొంత కాలం గడువు పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
గడువు పొడిగించాలి
గృహలకిë పథకానికి దరఖాస్తుల కోసం ప్రభుత్వం మూడ్రోజులు మాత్రమే గడువు విధించడం సరికాదు. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోలేకపో తున్నారు. ఇప్పటికీ చాలా మందికి దరఖాస్తుల విషయం తెలియదు. కొన్ని ధ్రువపత్రాలను సమకూర్చు కోవడంలోనూ జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టిసారించి దరఖాస్తులకు గడువు పొడిగించాలి.
– దర్శనాల మల్లేష్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి.
అధికార పార్టీ నేతల పెత్తనం
దరఖాస్తు గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించొచ్చని కూడా మంత్రి చెప్పారు. మంత్రి ఈ ప్రకటన చేయడానికి ముందే అధికార పార్టీ నేతలు తమకు సంబంధించిన దరఖాస్తులను సేకరించారు. తొలివిడత ప్రతి నియోజకవర్గానికీ 3000 ఇండ్లు మాత్రమే అనడంతో వేల సంఖ్యలో ఉన్న దరఖాస్తుదారుల్లో హడావుడి మొదలైంది. ఈ పథకం విషయంలో జిల్లాకో రూల్‌ ఉండటంతోపాటు దరఖాస్తు విధానంలోనూ తేడాలున్నాయి. అధికారికంగా ఎలాంటి దరఖాస్తూ అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రెస్సుల్లో జీవో ఎంఎస్‌ నంబర్‌ 25, జూన్‌ 21, 2023న ‘గృహలక్ష్మి దరఖాస్తు’ పేరిట ముద్రించిన వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 22 రకాల వివరాలతో దరఖాస్తు ఉండగా మరో జిల్లాలో మరో రకంగా ఉండటం గమనార్హం.
వారసత్వంగా వస్తోంది.. కాగితాలు ఏమీ లేవు
మా మామ నుంచి మాకు వారసత్వంగా ఇంటి స్థలం వచ్చింది. వారసత్వంగా వస్తున్న మా ఇంటి స్థలానికి ఎలాంటి కాగితాలూ లేవు. మరి మా పరిస్థితి ఎంటో అర్థం కావట్లేదు.
– సైదా, ఎం.వెంకటాయపాలెం, ఖమ్మం రూరల్‌

అధికారపార్టీ నేతలే పెత్తనం చేస్తున్నారు
అధికార పార్టీ నేతలు గృహలక్ష్మి స్కీం విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అప్లికేషన్‌లు తీసుకుని వారికి అనుకూలమైన వారికి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. మా గ్రామంలో 200 మందికి పైగా ఇండ్లులేని వారుంటే 30 మందికి ఇస్తామంటున్నారు. గడువు తక్కువగా ఉంది. తహసీల్దార్లు అందుబాటులో లేరు. దరఖాస్తుదారులు ఆందోళనలో ఉన్నారు.
– నండ్ర ప్రసాద్‌, ఎంపీటీసీ ఎం.వీ.పాలెం.

Spread the love