ఉప్పొంగిన కన్నీటి కష్టం..!

– నదీ పరివాహక ప్రాంతాలు అల్లకల్లోలం
– తీవ్ర నష్టాన్ని మిగిల్చిన వరద
– నీటిలోనే మురిగిన పత్తి, సోయా, కంది మొక్కలు
– మూడు సార్లు విత్తనం వేసినా.. చేతికొచ్చే పరిస్థితి లేదు
– పైరు ఎదుగుదల దశలోనే అన్నదాతలకు తీరని నష్టం
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంపైనే ఆశలు
ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం ఆనందపూర్‌ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నోముల రాజురెడ్డి. పెన్‌గంగా నదీ తీరంలో సొంతంగా 10 ఎకరాలు ఉంది. మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తొలుత వర్షాభావ పరిస్థితులతో వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. రెండుసార్లు విత్తనాలు విత్తాల్సి వచ్చింది. పత్తి పైరు పెరిగిన తర్వాత అధిక వర్షాలతో పెన్‌గంగా నది ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో పత్తి పైరు బురదలో కూరుకపోయి మురిగిపోయింది. చాలా వరకు కొట్టుకుపోయింది. 10 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.30వేల వరకు నష్టం జరిగినట్టు చెబుతున్నారు. ఇలా అనేక మంది రైతులకు వరద తీవ్ర నష్టం చేకూర్చింది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, జైనథ్‌
ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. రెండుసార్లు వేసిన విత్తనం భూమిలోనే ఉండిపోతే.. మూడోసారికి విత్తనం మొలకెత్తితే.. ఆ పైరునూ వరద ముంచింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పచ్చని పైర్లను వరద ముంచెత్తడంతో అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదు. కోలుకోలేని నష్టం సంభవించింది. పత్తి, సోయా, కంది పంట పొలాల్లో బురద, ఇసుక మేటలు వేయడంతో మొక్కలు నీటిలోనే మురిగిపోయాయి. ఖరీఫ్‌ ప్రారంభంలోనే నష్టాలను చవి చూసిన తమకు రానున్న కాలం ఏ మేరకు సహకరిస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అందించే సాయంపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాలో 80శాతం మంది రైతులు వర్షా ధారం మీదనే ఆధార పడి సాగు చేస్తు ంటారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో 16.80లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తుండగా.. ఇందులో అధికభాగం 11లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. 5లక్షల ఎకరాల్లో సోయా, కంది పంటలు వేశారు. ఖరీఫ్‌ ఆలస్యమైనా పంట ఎదుగుతుందని సంబర పడిన అన్నదాతలు తాజాగా కురిసిన వర్షాలతో కన్నీరు మున్నీరవుతున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఇదే మాదిరి వర్ష ప్రభావం ఉండటంతో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా, వార్దా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. వాగులు, వంకలు సైతం ఉగ్రరూపం దాల్చడంతో వాటి పరివాహక ప్రాంతాల్లోని పైర్లు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన రైతులకు చివరకు కన్నీరే మిగిలింది.
మూడు సార్లు విత్తనాలు
మృగశిరకార్తె ప్రారంభంలో రైతులు విత్తనాలు వేసినా.. వర్షాలు రాకపోవడంతో విత్తనాలు భూమిలోనే పోయాయి. తర్వాత వర్షం కురవడంతో మళ్లీ విత్తారు.
ఆ తర్వాత మళ్లీ వర్షాల జాడ లేక వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. తీరా వర్షాలు ఊపందుకున్నాక విత్తనాలు వేయగా.. పత్తి, సోయా, కంది పైర్లు కొంత ఎత్తు వరకు పెరిగాయి. దీంతో రైతులు కలుపు తీయించడం, ఎరువులు వేయడం వంటి చర్యలు చేపట్టారు. పైరు ఎదిగే క్రమంలో వర్షాలు పడటంతో వరద తాకిడికి పైర్లు తట్టుకోలేక కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో పంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ అధికారులు సుమారు 25వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ వేలాది ఎకరాల్లో నష్టం జరిగింది. మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో స్వల్పంగా పంటలు దెబ్బతిన్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో మాత్రం నష్టం మరింత ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులకు ఇన్సూరెన్సు సౌకర్యం లేకపోవడంతో వాతావరణ ఆధారిత బీమా వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విపత్తును పరిగణనలోకి తీసుకొని రైతులను ఆదుకోవాల్సి ఉంటుంది.
వరదతో పైరంతా పోయింది
నాకు పెన్‌గంగా నదీ తీరంలో 2.50ఎకరాల పొలం ఉంది. పత్తి, కంది పంట వేశాను. రెండు సార్లు విత్తనాలు మొల వకపోవడంతో మూడోసారి కూడా వేశాను. పైరు ఎదిగేందుకు ఎరువులు వేసి కలుపు తీయించాను. ఇప్పుడు వర్షాలు అధికం కావడం.. నది ఉప్పొంగడంతో పైరు వరదపాలైంది. ఎకరానికి పెట్టుబడి రూపంలో సుమారు రూ.30వేల వరకు ఖర్చు చేశాను. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకుంటుందనే ఆశతో ఉన్నాం.
– పి.రమేష్‌, డొలార, జైనథ్‌ మండలం

Spread the love