ఈ ఏడాది సెర్ప్ బ్యాంకు లింకేజీ లక్ష్యం రూ.15,037.40 కోట్లు
2023-24 బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళిక ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన మహిళలు, మహిళా సంఘాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో మహిళా సంఘాలు బలోపేతమవుతున్నాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హౌటల్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ సెర్ప్, బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను మంత్రి ఆవిష్కరించారు. వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు అవార్డులు అందజేశారు. బ్యాంకు రుణాలతో చిన్న పరిశ్రమలు నెలకొల్పి సక్సెస్‌గా నడుపుతున్న మహిళల విజయగాథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఈ బ్యాంకు లింకేజీ వార్షిక లక్ష్యం రూ.15,037.40 కోట్లుగా నిర్ణయించామన్నారు. మహిళలు చిన్న తరహా నుంచి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు తగినన్ని రుణాలను బ్యాంకులివ్వాలనీ, నిబంధనలను సడలించాలని బ్యాంకర్లను కోరారు.
దేశంలో 57శాతం మహిళలకు రుణాలందుతుంటే మన రాష్ట్రంలో 76శాతం రుణాలిస్తున్నామనీ, సగటున ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.5,56,556 రుణాలు అందించామని వివరించారు. రాష్ట్రంలో 553 మండల సమాఖ్యలు, 4,30,358 స్వయం సహాయక సంఘాలలో 46,46,120 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని వివరించారు. స్వయం సహాయక సంఘాల రుణ నిలువ ఈ ఏడాది 2023 మార్చి 31 నాటికి రూ.3,924.50 కోట్లుగా ఉందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లో మహిళలను సభ్యులుగా చేర్పించడంలోనూ, సంఘాలకు రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువ రుణం అందించడంలోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. బ్యాంకింగ్ సదుపాయాలు లేనిచోట్ల 680 మంది మహిళలకు వారం రోజుల శిక్షణ ఇచ్చామనీ, అందులో 622 మంది మహిళలు (97శాతం) ఐఐబిఎఫ్ పరీక్ష ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఆ మహిళలందరూ గ్రామాల్లో చిన్న చిన్న బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిగీ పే సఖి) నిర్వహిస్తూ సేవలందించడంతో పాటు కమిషన్ ద్వారా ఆదాయం కూడా పొందుతున్నారని వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ..మహిళల విజయగాథలను చూస్తుంటే మహిళల అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్లు మారాల్సిన అవసరం కనిపిస్తున్నదన్నారు. పలువురు మహిళలు తమ విజయ గాథలను వివరిస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్క బేనిషాన్ విషయంలోనే చూస్తే కేవలం 4 ఏండ్లల్లో మహిళలు 100 కోట్ల రూపాయల వ్యాపారం చేశారని అభినందించారు.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబమే గాక, రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని ఆయన వివరించారు.కార్యక్రమంలో ఆర్‌బీఐ ప్రతినిధి అమిత్, నాబార్డు సీజీఎం సుశీల చింతల, అనిల్ కుమార్, సెర్ప్ డైరెక్టర్ వైఎన్.రెడ్డి, సెర్ప్‌లోని వివిధ విభాగాల డైరెక్టర్లు, డీఆర్‌డీఓలు, ఏపీడీలు, పాల్గొన్నారు.