రాజకీయం కాదు.. బాధితులను ఆదుకోండి

Not politics.. Support the victims– పేదలకు నిత్యం అండగా ఎర్రజెండా : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి, పోతినేని
–  మోరంచపల్లి, గోవిందరావుపేటలో బాధిత ప్రజలకు ఆర్థిక సాయం
నవతెలంగాణ-భూపాలపల్లి/గోవిందరావుపేట
ప్రభుత్వాలు వరద రాజకీయాలు చేయడం మానుకొని, చేతనైతే బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు సూచించారు. ఎలాంటి కష్టాలు, సమస్యలు వచ్చినా పేదలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని స్పష్టంచేశారు. బుధవారం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ప్రేరణ స్వచ్ఛంద సేవా సంస్థ, మాకినేని బసవపున్నయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం, నిత్యావసర వస్తువులను అందించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా పరిధి మొరంచపల్లి గ్రామంలో వరద బాధితులకు పార్టీ జిల్లా కమిటీతో పాటు మాకినేని బసవపున్నయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వరదల్లో చనిపోయి, నష్టపోయిన సుమారు 170 కుటుంబాలకు రూ.1.20లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఆ సందర్భంగా పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. బాధిత ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మోరంచపల్లిలో గత నెల 27న ఆకస్మాత్తుగా వచ్చిన వరదలతో గ్రామంలోని ప్రజలు సర్వం కోల్పోయారని తెలిపారు. నలుగురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు ఆయా పార్టీలు ఎంతో మంది సాయం చేశారని, కానీ ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల చట్టం కింద ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం దేవేందర్‌, వెలిశెట్టి రాజయ్య, ప్రీతి, శ్రీకాంత్‌, నాయకులు రవి, వంగాల లక్ష్మి, కోమల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రాజెక్టునగర్‌ గ్రామంలో వరదలతో నష్టపోయిన 40 కుటుంబాలకు ప్రేరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందించారు. అలాగే గ్రామానికి చెందిన రెహమాన్‌ కుటుంబంలో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందగా.. వారి కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. వరదలు ముంచ్చెత్తి 15 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరిహారం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగి ప్రజలు కష్టాల్లో ఉంటే.. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వరదల వల్ల నష్టపోయిన ప్రజల పక్షాన పోరాడుతున్నామని స్పష్టంచేశారు. వరదల నుంచి శాశ్వతంగా గ్రామానికి విముక్తి కలిగేలా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ పట్టాలివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.
అనంతరం ప్రాజెక్టునగర లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, జిల్లా కమిటీ సభ్యులు పొదిల చిట్టిబాబు, అంబాల పోశాలు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్‌, జిల్లా కమిటీ సభ్యులు కొట్టెం కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love