భద్రాచలానికి బీజేపీ మరణశాసనం పోలవరం వల్లే ఈ దుస్థితి

– పోలవరం ముంపు అంచనాను నిర్దిష్టంగా వేయాలి
– 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలి
– సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలి
– వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.25వేలు పరిహారమివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎప్పుడూ లేనంతగా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాగులు, వంకలు తెగి గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించడంతో పంట పొలాల్లోకి నీరు చేసి తీవ్ర నష్టం ఏర్పడింది. నష్టాన్ని అంచనా వేయడానికి, బాధితుల్లో భరోసా కల్పించడానికి సోమవారం సీపీఐ(ఎం), రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం బృందాలు ములుగు, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించాయి.
నవతెలంగాణ-భద్రాచలం
పోలవరం ప్రాజెక్టు పేరుతో ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపి భద్రాచలం ప్రాంతానికి మరణ శాసనం రాసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని, ప్రధాని నరేంద్ర మోడీ విలీన మండలాలను ఆంధ్రాలో కలుపుతూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ పై మొదటి సంతకం చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు అన్నారు. భద్రాచలం పట్టణంలోని ముంపు ప్రాంతా లు, పునరావాస కేంద్రాలను సోమవారం ఆయనతో పాటు ఈ పార్టీ బృందం సం దర్శించింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలానికి ఈ దుస్థితి ఏర్పడిందని, ఈ ప్రమాదాన్ని సీపీఐ(ఎం) 2007లోనే పాలకుల దృష్టికి తీసుకొచ్చి అనేక ఆందోళనా పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఆ సందర్భంగా పార్టీ కార్యకర్తలపై కాల్పులు జరిపి జైలుకు పంపి 17 ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిప్పించిన పరిస్ధితి ఏర్పడిందని వెల్లడించారు. నేడు సీడబ్ల్యూసీ సైతం పోలవరం బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉన్నదని ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికైనా పోలవరం ముంపు అంచనాను నిర్దిష్టంగా వేయాలని కోరారు. ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపడం ద్వారానే భద్రాచలానికి భవిష్యత్తు ఉందని, అందుకు కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించేందుకు చొరవ చూపాలని, ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకురావాలని అన్నారు. నిత్యం రాముని జపం చేసే బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భద్రాచలం రాముని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడి కరకట్ట పొడిగించేందుకు ఉన్న ఆటంకాలను తొలగించి సమస్య పరిష్కరించాలని కోరారు. భద్రాచలం పట్టణం వరద ముంపునకు గురి కాకుండా శాశ్వత ప్రాతిపదికన స్లూయిజులు రిపేరు చేయించి మోటార్లు ఏర్పాటు చేయాలని, తగిన సిబ్బందిని నియమించాలని తెలిపారు. వరద వచ్చినప్పుడే కాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని, తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. వరద ముంపునకు గురై పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రతి కుటుంబానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భద్రాచలం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని లేకుంటే సీపీఐ(ఎం) ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని జాగ్రత్తలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌, యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. భారీ వర్షాలు వరదల కారణంగా ధ్వంసమైన రోడ్లు, చెరువులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. జిల్లాలో పంటలు పూర్తిగా నీట మునిగి నష్టం ఏర్పడిందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వరదలు. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు, సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య బృందాలను గ్రామాలకు అందుబాటులో ఉంచాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, కె.బ్రహ్మచారి, ఎంబీ నర్సారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు
అండగా ప్రభుత్వాలుండాలి అంచనాతో సంబంధం లేకుండా కేంద్రం ఆదుకోవాలి
– జనగామ, ములుగు జిల్లాల్లో వరద ప్రాంతాలను పర్యటించిన ఆలిండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్ల, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ , తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
నవతెలంగాణ – జనగామ కలెక్టరేట్‌
జనగామ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రజలు నివాస ప్రాంతాలను కోల్పోయారని, రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ఏజెన్సీల ప్రాంతాల్లోని ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా గ్రామాలకు గ్రామాలే వరద నీటిలో మునిగిపోయాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట అంచనాతో సంబంధం లేకుండా వరద బాధితులను, రైతులను ఆదుకునేందుకు నిధులను వెంటనే విడుదల చేయాలని నేతలు డిమాండ్‌
చేశారు. సోమవారం జిల్లాలో ఆలిండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్ల, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి తదితరులతో కూడిన బృందం వరద ప్రాంతాల్లో పర్యటించింది. నష్టపోయిన పంట పొలాలను, పత్తి చేలను, ధ్వంసమైన రోడ్లు, కూలిన నివాస గృహాలను బృందం సభ్యులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హన్నన్‌ మొల్ల, వెంకట్‌ మాట్లాడారు. తెలంగాణలోని 7, 8 జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిసాయని తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా లాంటి పంటలే కాకుండా కూరగాయల పంటలకూ నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను, వరద బాధితులను ఆర్ధికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసేందుకు కొంత సమయం పడుతుందని, దానితో సంబంధం లేకుండా జాతీయ విపత్తు నిధుల నుంచి వెంటనే ఆదుకోవాలని కోరారు. పంట నష్టం కింద ఎకరాకు రూ.20 వేలు, వాణిజ్య పంటలకు రూ.40 వేలు, చనిపోయిన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రైతులకు పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ వర్షాలకు ఆదివాసీ గూడేల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయిందని, తిండి గింజలు సైతం వరద నీటిలో కోల్పోయారని తెలిపారు. అయినా ఇప్పటి వరకు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించడంలో ప్రభుత్వాలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులను గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. గుజరాత్‌కి చేసిన సహాయం మిగతా రాష్ట్రాలకూ చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని, రైతులు, వరద బాధితుల గోసను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాస్తామని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలన్నారు. పర్యటనలో స్థానిక ప్రజాసంఘాల నాయకులు సాంబరాజుల యాదగిరి, వరలక్ష్మి, లలిత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ధర్మ బిక్షం తదితరులు ఉన్నారు.

Spread the love