గూడు కోసం గుంపుగా..

కలెక్టరేట్లను ముట్టడించిన నిరుపేదలు
– ఇండ్లు, స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌
– రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా.. నిరసన ప్రదర్శనలు ..పలు చోట్ల ఉద్రిక్తతలు.. అడ్డగింతలు..
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
గూడు కోసం నిరుపేదలంతా గుంపుగా కదిలారు.. ఎర్రజెండా నీడలో పేదలంతా కదం తొక్కారు.. అధికారులకు తమ మొర వినిపించేందుకు సీపీఐ(ఎం), తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక అండగా.. కలిసికట్టుగా సోమవారం కలెక్టరేట్లకు తరలివచ్చారు.,భారీగా తరలివచ్చిన మహిళలు
నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ‘ఇంటి జాగాలు లేనిది.. గృహలక్ష్మి పథకం ఎక్కడ అమలు చేస్తారు సీఎం కేసీఆర్‌ సార్‌.. ముందు ఇంటి జాగాలు ఇవ్వండి. మీరు ఇస్తారా లేక మేం ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసుకోవాలా..? కలెక్టరేట్‌లో ఉన్న ఖాళీ జాగాలో గుడిసెలు వేసుకుంటాం’ అని మహిళలు నినాదాలు చేశారు. గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్‌ మాట్లాడారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇండ్ల విషయంలో దశాబ్ద కాలంగా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్లను ముట్టడించారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట మహాధర్నా చేశారు. భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులకు నాయకులకు తోపులాట, వాగ్వాదం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భారీ ప్రదర్శన, జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ అనుదీప్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్‌ అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ ప్రసంగించారు. కొత్తగూడెం, పాల్వంచలో
డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణం మొదలెట్టి ఎంతకాలం అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని సవరించి రూ.5 లక్షలు, పీఎం ఆవాస్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని అన్నారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అడ్డంకులు
మహబూబాబాద్‌ జిల్లాలో పెద్దఎత్తున మహాధర్నా జరిగింది. ప్రజాసంఘాల పోరాట వేదిక ప్రతినిధి బృందం కలెక్టర్‌ శశాంక్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. తెలంగాణ సాయుధ పోరాట వారసురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కొనసాగుతున్న గుడిసెల పోరాటం ఆగదని ప్రజా సంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య అన్నారు. రాజ్యాంగబద్ధంగా భూమి లేని పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడం వారి హక్కు అని, కలెక్టర్‌, ఎమ్మెల్యే వారికి అండగా నిలబడి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాకు భారీఎత్తున పేదలు కదిలొచ్చారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు భారీగా మోహరించి కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన ద్వారం మూసేశారు. కేవీపీస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పాల్గొన్నారు. జనగామ జిల్లా లోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చు కుపోకుండా పోలీసులు ముండ్ల కంచె వేశారు. ఈ క్రమంలో ప్రజాసంఘాల నాయకులకు పోలీసులకు వాగ్వాదం జరిగింది.
వనపర్తి జిల్లా కేంద్రం లోని ఆర్డీఓ కార్యా లయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ తీశారు. కలెక్టరేట్‌ సమీకృత కార్యా లయం ఎదుట ధర్నాలో తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర నాయకులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ 125 గజాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు మహబూబ్‌నగర్‌ జిల్లా మహాధర్నాలో మాట్లాడారు.
ఉద్రిక్తంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌
నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. మొదట కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. ఆ తరువాత నాయకులు, ప్రజలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు నిలువరించారు. ప్రధాన గేటుకు తాళం వేశారు. సీఐటీయూ జిల్లా నాయకుడు మల్యాల గోవర్ధన్‌ ఇనుప గేటు ఎక్కి లోపలికి దూకారు. మిగతా నాయకులు, ప్రజలు గేట్లు తోచుకుంటూ ముందుకు సాగారు. దీంతో తాళం విరిగి గేటు తెరుచుకుంది. ‘పేద లకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలి’ ‘ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి’ అంటూ పెద్దఎ త్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. కలెక్టరేట్‌ లోపల మరోసారి బారికేడ్లతో ఆందోళనకారులను పోలీసులు నిలువరించారు. ‘ఎండలో మేము.. ఏసీల్లో మీరా?.. ‘కలెక్టర్‌ బయటకు రావాలి.. ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలి’ అని నినాదాలు చేశారు. అయితే ప్రతినిధి బృందాన్ని కలెక్టర్‌తో కలిపిస్తామని పోలీసులు చెప్పగా.. కలెక్టర్‌ బయటకు వచ్చి మా బాధలు వినాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో కలెక్టర్‌ పరిపాలన అధికారి ప్రశాంత్‌ ప్రజాసంఘాల నాయకుల వద్దకు వచ్చి నచ్చజేప్పేందుకు యత్నించారు. కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరిస్తామని హామీఇచ్చారు. వీలైనంత త్వరగా సర్వేయర్‌ను పంపుతామని కలెక్టర్‌ హామీనిచ్చారు. అంతకుముందు ధర్నానుద్దేశించి తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు శోభన్‌ నాయక్‌ మాట్లాడారు.
సూర్యాపేట కలెక్టర్‌ కారు అడ్డగింత..
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. కోటి ఆశలతో ఏర్పడిన రాష్ట్రంలో పేదల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌ నుంచి బయటకు వచ్చిన కలెక్టర్‌ వెంకట్రావు కారును ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు ప్రజాసంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వావాదం జరిగింది. అనంతరం కలెక్టర్‌ వెంకట్రావుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టరేట్‌ ఏవో శ్రీదేవికి అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక జిల్లా కన్వీనర్‌ మల్లు నాగార్జున రెడ్డి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు గృహలకిë పథకం కింద రూ.ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్‌, మేడ్చల్‌లో భారీగా..
హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. నగరంలో ఇండ్లులేని పేదలు 10లక్షలకుపైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా అర్హులకే డబ్బుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పేదలు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర నాయకులు ఫైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ.. చెన్నూరులోని బావురావుపేట శివారు సర్వే నెంబర్‌ 8లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు భూ కబ్జాదారులు అక్రమ పట్టాలు చేసుకున్నారని, వాటిని రద్దు చేసి పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఆవాస్‌ యోజన జాడేదీ..
ఇండ్ల స్థలాలివ్వాలని, గతంలో పట్టాలిచ్చిన చోట పొజిషన్‌ చూపాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట వందలాది మంది పేదలు ధర్నా చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ఉపాధ్యక్షులు జె.మళ్లికార్జున్‌ పాల్గొని వారినుద్దేశించి మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఎక్కడా పేదలకు ఇండ్లు కట్టించిందిలేదన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పేదలు పెద్దఎత్తున ధర్నా చేశారు.
యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌ ఎదుట ధర్నానుద్దేశించి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ మాట్లాడారు. ఇండ్ల స్థలాలు లేని పేదలందరినీ గుర్తించి 125 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ధర్నా దగ్గరకు వచ్చిన కలెక్టరేట్‌ పరిపాలన అధికారి నాగలక్ష్మి, భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన కలెక్టర్‌ బొర్కాడే హేమంత్‌ దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Spread the love