కేరళకు ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ హోదా

– సరైన పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపులో భేష్‌
– తెలంగాణ, కర్నాటకలకూ ఇదే హోదా
 న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. రాష్ట్రం లోని అన్ని గ్రామాలను స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దినందుకు కేంద్రం కేరళకు ‘బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌’ హౌదాను అందించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన అంశాల ప్రకారం అన్ని గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్మూలన కోసం ఆధునిక సౌకర్యాలు కల్పించబడినందున కేరళ ఈ హౌదాను పొందిందని కేరళ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (కేఎస్‌డబ్ల్యూఎంపీ) విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. డిసెంబర్‌ 2023 నాటికి కేరళ 100 శాతం ఓడీఎఫ్‌ మోడల్‌ హౌదాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది పూర్తయితే దేశంలోనే ఆ లక్ష్యాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించ నున్నదని అంచనా. కేఎస్‌డబ్ల్యూఎంపీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ”అన్ని గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఈ విషయంలో ప్రమాణాలను చేరు కోవడంలో కేంద్రీకరించిన ప్రయత్నాలు కేరళకు హౌదాను సాధించడంలో సహాయపడ్డాయి. ఇది ప్రభుత్వ విధాన కార్యక్రమాలు, వాటి కచ్చితమైన అమలును ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నది.
గ్రామ పంచాయతీలు బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాల మూల స్థాయి నిర్వహణ, హరిత కర్మ సేన ద్వారా బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాల సేకరణ, కమ్యూనిటీ, గృహ మరుగుదొడ్ల నిర్మాణం, బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాల కోసం పబ్లిక్‌ డిస్పోజల్‌ ఫెసిలిటీస్‌ ఏర్పాటు, ద్రవ వ్యర్థాలను పారవేసే సౌకర్యాలు, వివిధ ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,509 గ్రామాలలో 491 గ్రామాలకు ‘ఆస్పైరింగ్‌’, 48 ‘రైజింగ్‌’, 970 ‘మోడల్‌’ కేటగిరీలో ఓడీఎఫ్‌ ప్లస్‌ హౌదాను పొందాయని పేర్కొన్నది. శాతాలవారీగా చూస్తే దేశంలోనే కేరళలో అత్యధిక మోడల్‌ గ్రామాలు ఉన్నాయి. సంవత్సరాంతానికి 100 శాతం ఓడీఎఫ్‌ మోడల్‌ హౌదాను సాధించడానికి.. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా ఉంచడంతోపాటు పాఠశాలలు, అంగన్‌వాడీలు, గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయాలు, పబ్లిక్‌ వాష్‌రూమ్‌లలో మంచి నిర్వహణతో కూడిన మరుగుదొడ్లను సృష్టించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రకటన వివరించింది. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో నీరు నిలిచిపోవడం, చెత్త కుప్పలు నివారించడం, కమ్యూనిటీ కంపోస్ట్‌ సౌకర్యాలు సృష్టించడం, బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాల సేకరణ, నిర్వహణ వంటి సౌకర్యాలున్నాయని పేర్కొన్నది. కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణలకూ ఓడీఎఫ్‌ ప్లస్‌ హౌదా లభించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నది.

Spread the love