సిబ్బందే లేకుండా భద్రత ఎలా?

–  సిగల్‌, ట్రాఫిక్‌ విభాగాల్లో భర్తీకాని 77 వేల పోస్టులు
– మొత్తంగా 3 లక్షల పోస్టులు ఖాళీ
– రైల్వేశాఖ ఉద్యోగ నియామకాల్లో కేంద్రం నిర్లక్ష్యం
ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటుకు అప్పగిస్తూ.. జనం ప్రాణాల మీదకు వచ్చినపుడు మతరంగు పులిమి రాజకీయం చేయటానికి సైతం మోడీ ప్రభుత్వం వెనుకాడటంలేదు. ఆసియాలోనే అతిపెద్ద రైల్వేనెట్‌ వర్క్‌ ఉన్నా.. లక్షలకిలోమీటర్ల పట్టాలు, 8 వేలకుపైగా రైల్వేస్టేషన్లు ఉన్నా.. దాని బాగోగుల గురించి పట్టించుకోవటంలేదు. మోడీ హయాంలో జరిగిన రైలు ప్రమాదాల్లో మూడు లక్షలమందికి పైగా చనిపోయినట్టు అధికారవర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. అయితే తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ వాస్తవాలను దాచిపెడుతోంది. సిగల్స్‌ నిర్వహణకు సరైన సిబ్బందిలేని పట్టాలపై..ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, సమస్యల సుడిగుండంలో ఉన్న రైల్వేను చిన్న చూపు చూస్తున్నదని ప్రజలు, ప్రతిపక్షాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో కత్తిరింపులే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేల్లో భద్రతకు సంబంధించి వివిధ విభాగాల్లో సిబ్బందిని ఏండ్ల తరబడి భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా రైల్వేలో కీలకమైన సిగల్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాల్లో 77 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేయలేదు. భారతీయ రైల్వేలో మూడు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ వివరాలను సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2022 డిసెంబరు 23న రాజ్యసభలో మంత్రి మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా రైల్వేల్లో 3.12 లక్షల నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది’ అని తెలిపారు. ఇందులో కీలకమైన సిగల్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాల్లో గణనీయమైన సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని చెప్పారు. సిగల్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌లో 14,815 ఖాళీలు, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో 62,264 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అత్యధికంగా 87,654 పోస్టులు, మెకానికల్‌ విభాగంలో 64,346 ఖాళీలు, ఎలక్ట్రికల్‌ విభాగంలో 38,096 ఖాళీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కీలకమైన కార్యాచరణ విభాగాల్లో సిబ్బంది కొరత భారతీయ రైల్వేల సమర్థవంతమైన పనితీరుకు సవాల్‌గా నిలుస్తున్నది. ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
ప్రమాదం జరిగిన సౌత్‌ ఈస్టర్న్‌లో 17,811 ఖాళీలు
శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లా బహనగ బజార్‌ సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే పరిధిలోకి వస్తుంది. మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ సౌత్‌ ఈస్టర్న్‌లో 17,811 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు, 150 గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల ఖాళీల విషయంలో ఉత్తర రైల్వే జోన్‌లో అత్యధికం గా 39,226 ఖాళీలు ఉన్నాయి. పశ్చిమ రైల్వే జోన్‌లో 30,785 ఖాళీలు ఉన్నాయి. తూర్పు రైల్వే జోన్‌లో 30,735, సెంట్రల్‌ రైల్వే జోన్‌లో 28,876 ఖాళీలు ఉన్నాయి. నైరుతి రైల్వే జోన్‌లో 6,638 ఖాళీలు ఉన్నాయి. భారతీయ రైల్వేలో మొత్తంగా ఏ, బీ, సీ గ్రూపుల్లో 3,15,780 ఉద్యోగా లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లి ఖార్జున ఖర్గే వేసిన వరస ప్రశ్నలకు స్వయంగా మంత్రి ఇచ్చిన సమాధానాలివి. అలాగే, 2021- 22లో గ్రూప్‌ ఏ, సీలలో కేవలం 4,625 ఉద్యోగా లను భర్తీ చేసినట్టు మంత్రి చెప్పారు. ఇదే సమయం లో 44,847 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. ఈ ఏడాదిలో సుమారు 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని రైల్వే శాఖ హమీ ఇచ్చింది. 2020 నుంచి 2022 మధ్యకాలంలో సుమారు 3.5 కోట్ల మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఒక్క సెంట్రల్‌ రైల్వే జోన్‌లోనే నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌ సీ పోస్టులు 28,650 ఖాళీగా ఉన్నాయి. ఇందులో భద్రతా విభాగం పోస్టులే 14,203 ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో మొత్తంగా భారతీయ రైల్వేల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తున్నది. ఇలా అయితే భద్రత ఎలా సాధ్యమని నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Spread the love