పీటముడులు విప్పేదెలా?

– చట్టాలలో వైరుధ్యాలు
– ఎవరి సంప్రదాయం వారిదే
– అన్నింటినీ కలగలపడం సాధ్యమా?
– యూసీసీ రూపకల్పన అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందేందుకు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే ఇది అంత సులభమేమీ కాదు. ఎందుకంటే మన దేశం వివిధ మతాలు, జాతుల సమ్మేళనం. ఎవరి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు వారివి. మతాచారాల ప్రకారమే చట్టాలను రూపొందించారు. అయితే యూసీసీ వస్తే ఇవేమీ ఉండవు. కులం, మతం, జాతి వేరైనా అందరికీ ఒకే చట్టం. భారత రాజ్యాంగం కుల మతాలకు అతీతంగా ప్రతి పౌరుడికీ సమానత్వపు హక్కుకు, న్యాయం పొందే హక్కుకు, జీవించే హక్కుకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ మతాల వారికి ప్రస్తుతం అమలులో ఉన్న వేర్వేరు చట్టాలను విశ్లేషించి, ఆ తర్వాతే యూసీసీ ముసాయిదాను రూపొందించాల్సి ఉంటుంది.
వీలునామా రాయకుండా చనిపోతే…
ఇప్పుడు వివిధ మతాల వారికి ఉద్దేశించిన చట్టాలలో వైరుధ్యాలను గమనిద్దాం. ఉదాహరణకు ఒక తండ్రికి కుమారుడు, కుమార్తె ఉన్నారనుకోండి. కుమారుడికి ఓ కొడుకు, కుమార్తెకు ఓ కొడుకు ఉన్నారు. ఓ దుర్ఘటనలో తండ్రి, కుమారుడు, కుమార్తె చనిపోయారు. ఇక మిగిలింది ఇద్దరు మనుమలు. తండ్రి తన ఆస్తుల పంపకానికి సంబంధించి వీలునామా ఏదీ రాయలేదు. తండ్రి హిందువు అయితే ఆస్తి ఎవరికి చెందుతుంది ? కుమారుడి కొడుకుకే చెందుతుంది. కుమార్తె కొడుకుకి ఏమీ రాదు. అదే తండ్రి పార్సీయో, క్రైస్తవుడో అయితే ఆయన ఆస్తి ఇద్దరు మనుమలకూ సమానంగా లభిస్తుంది. ముస్లింలకు సంబంధించిన చట్టంలో రెండు రకాల వారసులు ఉంటారు. వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తిని చట్టబద్ధమైన వారసులందరికీ సమానంగా పంచడం ఒక పద్ధతి. రెండో పద్ధతిలో వారసులందరూ ఆస్తిని పంచుకున్న తర్వాత మిగిలిన ఆస్తిని సంబంధీకులెవరైనా ఉంటే వారికి ఇస్తారు. దీని ప్రకారం కుమారుడి కొడుకుకు, కుమార్తె కొడుకుకు ఆస్తిలో వాటా వచ్చినా కుమారుడి కొడుకుకే ఎక్కువ ఆస్తి లభిస్తుంది. ఎందుకంటే కుమార్తె కొడుకు సంబంధీకుల జాబితాలో ఉంటాడు.
వివాహిత మహిళ చనిపోతే…
ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. ఒక మహిళ ఉందనుకుందాం. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు. ఒక పాప. వృద్ధులైన తల్లిదండ్రులకు ఆ మహిళ ఒక్కరే కుమార్తె. ప్రమాదంలో ఆ మహిళ చనిపోయిందనుకుందాం. ఆమె వారసుడెవరనేది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఆ మహిళ పార్సీ అనుకుందాం. ఆస్తిని నాలుగు భాగాలు చేసి భర్తకు ఒక భాగం, ఇద్దరు పిల్లలకూ చెరో భాగం ఇస్తారు. మిగిలిన భాగాన్ని రెండుగా విభజించి తల్లిదండ్రులకు పంచుతారు. ఒకవేళ ఆ మహిళ క్రైస్తవ మతస్థురాలు అనుకుందాం. ఆస్తిని మూడు భాగాలు చేసి భర్త, ఇద్దరు పిల్లలకు పంచుతారు. ఆమె తల్లిదండ్రులకు ఏమీ లభించదు. ఒకవేళ ఆ మహిళకు పిల్లలు లేకపోతే భర్తకు, తండ్రికి చెరి సగం పంచుతారు. తల్లికి ఏమీ రాదు. మహిళ హిందూ స్త్రీ అయితే భర్త, పిల్లల మధ్య ఆస్తిని పంచుతారు. తల్లిదండ్రులకు వాటా రాదు. అయితే ఆ మహిళ పిల్లలు లేని వితంతువు అయినా, భర్తకు వారసులు ఎవరూ లేకపోయినా అప్పుడు ఆమె తల్లిదండ్రులకు ఆ ఆస్తి చెందుతుంది. ఒకవేళ ఆ మహిళ ముస్లిం అయితే ఆమె భర్తకు నాలుగో వంతు ఆస్తి వస్తుంది. కుమార్తెకు వచ్చే ఆస్తికి రెట్టింపు ఆస్తి కుమారుడికి వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఒక వాటా పొందవచ్చు. ఆ మహిళకు పిల్లలు లేరనుకుందాం. భర్తకు సగం ఆస్తి దక్కుతుంది. మిగిలినది తల్లిదండ్రులకు పంచుతారు.
జటిలం…సంక్లిష్టం
దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే ఒక్కో సందర్భంలో ఒక్కో మతానికి చెందిన చట్టం మేలైనదిగా అనిపిస్తుంది. మత ప్రాతిపదికన రూపొందించిన చట్టాలు జటిలమైనవి, సంక్లిష్టమైనవి. వారసత్వానికి సంబంధించి వీటి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలోనే కాదు… దత్తత, వివాహం, విడాకుల విషయంలో కూడా ఈ చట్టాలు పరస్పర విరుద్ధంగా, జటలంగానే ఉన్నాయి. దీనికి కారణమేమిటి ? మన దేశంలో అన్ని రకాల సంప్రదాయాలనూ పాటిస్తారు. వీటిని క్రోడీకరిస్తే నిబంధనలన్నీ పీటముడులతో కూడి ఉంటాయి. మినహాయింపులూ ఉంటాయి. ఈ చిక్కుముడులను విడదీసి, ఒకేలా ముడివేస్తే అదే యూసీసీ అవుతుంది. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన చట్టం సాధ్యమేనా? ఒక మతానికి సంబంధించిన నిబంధనలు మరో మతానికి వర్తించవు. మహిళకు సంబంధించిన ఉదాహరణనే తీసుకుందాం. వివాహిత మహిళ ఆస్తిలో వాటా విషయంలో క్రైస్తవులు, హిందువులు తల్లిదండ్రులను పరిగణనలోకి తీసుకోరు. పార్సీ, ముస్లిం మహిళలు అయితే తల్లిదండ్రులు కూడా ఆమె ఆస్తిలో వారసులు అవుతారు. మరి ఎవరి సంప్రదాయాన్ని అనుసరించాలి? ఏది ఉత్తమం? ఎవరి సంప్రదాయాన్ని పాటించినా మరొకరి హక్కుకు భంగం కలుగుతుంది. సమానత్వం, న్యాయం, జీవనం వంటి విషయాలలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. ఓ పెద్ద మనిషి చెప్పినట్లు ‘యుసీసీ అంటే అందరికీ ఒకే చట్టం. అయితే అది లింగ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఏకరీతి సూత్రాలపై ఆధారపడిన వ్యక్తిగత చట్టాల సమాహారం’.

Spread the love