కిర్బీ పరిశ్రమలో సీఐటీయూ హ్యాట్రిక్‌

– 46 ఓట్లతో బీఆర్‌ఎస్‌కేవీపై సీఐటీయూ విజయం
–  మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై సీఐటీయూ
– రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు గెలుపు
–  ఇది కార్మికుల విజయం
– ప్రతి కార్మికుడికి అండగా ఉంటాం
–  కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ
నవతెలంగాణ – పటాన్‌చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని కిర్బీ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ ముచ్చటగా మూడోసారి విజయకేతనం ఎగురవేసింది. పటాన్‌చెరు మండలం పాష మైలారం పారిశ్రామికవాడలోని కిర్బీ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్‌ఎస్వేవీ, బీఎంఎస్‌, టీఎన్‌టీయూసీ మహాకూటమిగా ఏర్పడినప్పటికీ కార్మికులు సీఐటీయూకే పట్టంగట్టారు. పరిశ్రమలో మొత్తం 604 ఓట్లకుగాను 600 ఓట్లు పోలయ్యాయి. నలుగురు గైర్హాజరయ్యారు. సీఐటీయూకు 323 ఓట్లు రాగా మహాకూటమికి 277 ఓట్లు వచ్చాయి. 46 ఓట్ల మెజారిటీతో సీఐటీయూ విజయభేరి మోగించింది. కార్మికులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పరిశ్రమ నుంచి పటాన్‌ చెరు పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ విజయోత్సవ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్మికుల ఆనందోత్సవాల మధ్య చుక్క రాములు మాట్లాడుతూ.. ఇది కార్మిక విజయమని అన్నారు. మాజీ కార్మిక శాఖ మంత్రి పెద్దిరెడ్డిని కార్మికులు విశ్వసించలేదని తెలిపారు. ప్రతిపక్ష యూనియన్లు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కార్మికులను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేసినప్పటికీ నమ్మకంతో సీఐటీయూను గెలిపించారని, ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికుల పక్షాన ముందుండి పోరాడుతామని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్‌, జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాండురంగారెడ్డి, నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, కిర్బి పరిశ్రమ నాయకులు వీఎస్‌ రాజు, మల్లేష్‌ వివిధ పరిశ్రమల నాయకులు శ్రీనివాస్‌, తలారి శ్రీను, వీరప్ప, సుధాకర్‌, విట్టల్‌, ప్రభు, శంకర్‌, వివిధ పరిశ్రమల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love