గుడిసె పోరాటాలు..

–  పాతికేండ్లు కావస్తున్నా.. పట్టాలకు నోచుకోని వైనం
– పట్టాలు ఇవ్వాలని ఐదు నెలలుగా బాధితుల ఆందోళనలు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
ఒక ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పేదల ఇంటి జాగాలు, భూములను మరో ప్రభుత్వం లాగేసుకోవడం పరిపాటిగా మారింది.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1996 -97లో ఇండ్ల స్థలాల కోసం ఇస్తే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటోంది.. దీన్ని నిరసిస్తూ తమ స్థలాలను తమకే ఇవ్వాలంటూ బాధితులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐదు నెలలుగా పోరాడుతు న్నారు.. అక్కడే గుడిసెలు వేసుకుని ఉంటు న్నారు. వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తా మని హెచ్చరిస్తున్నారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాల్టీ పరిధిలో పేదల కోసం పాతిక సంవత్సరాల కిందట టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇంటి జాగాల పట్టాలిచ్చింది. పట్టణానికి దగ్గరలో దుబాయికుంటలో 7.30 ఎకరాలను 1996-97లో పేదల ఆవాసాల కోసం పంపిణీ చేశారు. కానీ వారికి హద్దులు చూపించలేదు. దాంతో అప్పటి నుంచి ఇండ్లు కట్టుకోలేకపోయారు. మొత్తం 400 మంది లబ్దిదారులున్నారు. గతేడాది సెప్టెంబరు 6న బాధితులంతా.. తమ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. పట్టాలకు సంబంధించి హద్దులు చూపించాలని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అమరచింతలో బాధితులు పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి ఆ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. దాంతో ఎంఆర్‌ఓతో పాటు సీఐ, 20 పోలీసులు వచ్చి హద్దులు చూపిస్తామని హామీ ఇచ్చారు. ఐదు నెలలు దాటినా హామీ అమలు కాలేదు. మక్తల్‌ ఎమ్మెల్యే, వనపర్తి కలెక్టర్‌, మంత్రి నీరంజన్‌రెడ్డికి విన్నవించుకున్నా ఫలితం లేదు. దాంతో బాధితులంతా రోజూ అక్కడే ఉంటూ నిరసన తెలుపుతున్నారు. ఒక్కో ఇంటికోసం ఇప్పటికే రూ. 10 వేలు ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ ఒక కాలనీ మాదిరిగా తయారైంది. సీపీఐ(ఎం) నాయకులే గుడిసెవాసులకు తాగునీరు, విద్యుత్‌ ఏర్పాటు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో పెద్దఎత్తున ఎంఆర్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం అఖిలపక్షం ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలన్నీ పేదల పక్షమేనని నేతలు చెప్పారు. బాధితులకు స్థలాల హద్దులు చూపించాలని డిమాండ్‌ చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం గుడిసెలు తీయాలని పట్టుబట్టగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిసెలు తీసేది లేదని సీపీఐ(ఎం) నేతలు వాదించారు.
నిరుపేదల నిరీక్షణ
ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల ఆవాసాల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. వనపర్తి జిల్లా, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌, ఎత్తం, బల్మూరు, అచ్చంపేట , కల్వకుర్తి ప్రాంతాల్లో ఇంటి స్థలాల కోసం ఉద్యమాలు చేస్తున్నారు. కొల్లాపూర్‌లో 8ఎకరాలు, బల్మూరులో 4 ఎకరాల్లో ప్లాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను పంచాలని కోరుతున్నా… పాలకులు స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల సొంతింటి కల నెరవేర్చాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
పట్టాలు ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
ఎండి జబ్బార్‌- సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి
జిల్లాలో అనేక చోట్ల పేదలకు ఆవాసాల కోసం గతంలో ఇచ్చిన స్థలాలను ఇప్పటికీ చూపలేదు. ముఖ్యంగా అమరచింత పట్టణంలో 400 మంది ఇండ్ల కోసం 7.30 ఎకరాలను పాతికేండ్ల కిందట కేటాయించారు. ఇప్పటికీ స్థలాలకు హద్దులు చూయించలేదు. స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలి. లేనిచో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.

Spread the love