మ్యాన్‌హోల్స్‌ తెరిస్తే క్రిమినల్‌ కేసులు

Criminal cases if manholes are opened– జలమండలి పరిధిలోని అన్నింటికీ సేఫ్టీ గ్రిల్స్‌ బిగింపు
– క్షేత్ర స్థాయిలో ఎమర్జెన్సీ బృందాల పర్యటన
– పర్యవేక్షణకు సెక్షన్‌కు ఒక ప్రత్యేక బృందం
– జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో పనులు
హైదరాబాద్‌ నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా అతలాకుతలమవుతోంది. కాలనీలు, అపార్టుమెంట్లు మురుగునీటితో మునిగిపోతు న్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతు న్నాయి. ఈ క్రమంలో ఎక్కడ ప్రమాదం పొంచివుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరద ఉన్నప్పుడు ఎక్కడ మ్యాన్‌హౌల్‌ ఉందో, ఏ ప్రాంతంలో తెరిచి ఉన్నాయోనని నిత్యం జనం భయంతో రోడ్లపై ప్రయాణం చేయాల్సి వస్తోంది.
నవతెలంగాణ-సిటీబ్యూరో
జంట నగరాల్లో జనం ప్రాణాలు అర చేతిలో పెట్టుకోని బతకాల్సివస్తోంది. ఇక వర్షాలు పడితే మాత్రం ఎక్కడ మునిగి.. ఎక్కడ తేలుతామో…తెలియని పరిస్థితి. సాఫీగా నీరు వెళ్లేందుకు కొందరు మ్యాన్‌హౌల్స్‌ తెరుస్తుండటంతో అమా యకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. గత ఆదివారం నగరంలో భారీ వర్షాలకు గాంధీనగర్‌కు చెందిన లక్ష్మీ నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన సంఘటన మర్చిపోకముందే బాచుపల్లిలో బాలుడు ప్రాణం కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కాలనీ అసోసియేషన్‌ ప్రతినిధి, అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ నిర్లక్ష్యం కారణంగా బాలుడు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయి మృతిచెందాడు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సంఘటనతో మరింత అప్ర మత్తమైన అధికారులు మ్యాన్‌హౌల్స్‌ తెరుస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్లపై ఉన్న మ్యాన్‌ హౌళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు.
రంగంలోకి ఏస్‌.పీ.టీ వాహనాలు
నగరంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. లోతైన మ్యాన్‌ హౌళ్లతోపాటు 22 వేలకు పైగా మ్యాన్‌ హౌళ్లపై సేఫ్టీ గ్రిల్స్‌ బిగించారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్‌ చేసి, రెడ్‌ మార్కు ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (ఈఆర్టీ), మాన్‌సూ న్‌ సేఫ్టీ టీమ్‌ (ఎమ్మెస్టీ), సేఫ్టీ ప్రోటోకాల్‌ టీమ్‌ (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్‌ మోటార్‌ ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తా రు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. వీటితో పాటు ఎయిర్‌ టెక్‌ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మరోవైపు మ్యాన్‌ హౌళ్ల నుంచి తీసిన వ్యర్థాల(సిల్ట్‌)ని ఎప్పటికప్పుడూ తొలగిస్తున్నారు.
సెక్షన్‌కు ఒక బృందం
మ్యాన్‌ హౌళ్లను పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్‌ నుంచి సీవర్‌ ఇన్‌ స్పెక్టర్‌ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేశారు. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పర్యవేక్షి స్తున్నారు. చోకేజీ, వాటర్‌ లాగింగ్‌ పాయింట్లను జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పు డూ క్లియర్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకుంటూ జలమండలి అధికారులు పనులను పూర్తి చేస్తున్నారు.
మ్యాన్‌ హౌళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా..
ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌ హౌళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా ‘హెచ్‌ఎండబ్య్లూఎస్‌ఎస్‌బీ యాక్టు – 1989’ సెక్షన్‌ 74 ప్రకారం నేరం. నిబంధనలను అతిక్రమిస్తే వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు.
కార్మికులకు శిక్షణ
పారిశుధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా వ్యవహరించాలనే పలు అంశాలపై జలమండలి ప్రతియేటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. వర్షాకాలంలో సీవరేజి నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలనే అంశాలపై జలమండలి విరివిగా ప్రచారం చేస్తోంది. స్థానిక కాలనీల సంఘాలు, ఎస్‌.హెచ్‌ గ్రూపుల సభ్యులతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. మ్యాన్‌ హౌళ్లు తెరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని జలమండలి ఎండీ దానకిషోర్‌ హెచ్చరించారు.

Spread the love