‘ఎస్‌ఎస్‌ఏ’ల పోరు ఉధృతం

The battle of 'SSA's' is raging–  9వ రోజుకు చేరిన ఉద్యోగుల రిలే దీక్షలు
– పెరుగుతున్న ప్రతిపక్ష, ప్రజా, ఉద్యోగ సంఘాల మద్దతు
– ఉద్యోగభద్రత, మినిమం టైం స్కేల్‌ కోసం ఆందోళన
– ఉమ్మడి కరీంనగర్‌లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షలు
– మాట ఇచ్చి పాలకులు మరిచారంటూ ఆవేదన
విద్యావ్యవస్థకు వెన్నెముకగా సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు, బాలికల విద్య అంటేనే కేజీబీవీలు అనే విధంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.. అందులో సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు 19 ఏండ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యాసమాచారాన్ని జిల్లాకు చేరవేయాలన్నా.. జిల్లాస్థాయి విద్యా సమాచారాన్ని ప్రాథమిక స్థాయికి చేరవేయాలన్నా.. సమగ్ర శిక్ష అభియాన్‌లో పని చేస్తున్న సీఆర్పీలు కీలకం. 2004 నుంచి 19ఏండ్లుగా పని చేస్తున్న వీరికి ప్రభుత్వ నుంచి వచ్చే అరకొర జీతం తప్ప ఏ సౌకర్యానికీ నోచుకోవడం లేదు. ఉద్యోగం రెగ్యులరైజేషన్‌ ఏమోగానీ మినిమం టైం స్కేల్‌ కూడా ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. తమ సమస్యలపై వారంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 1971 మంది సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు 9 రోజులుగా సమ్మెలో ఉన్నారు.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
గత అసెంబ్లీ సమావేశాల్లోనే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండకూడదని ప్రకటించిన విషయం తెలిసిందే. వనపర్తిలో నిర్వహించిన ఓ సభలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని మాట ఇచ్చి మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగ, అధ్యాపక, వీఆర్‌ఏ, పంచాయతీ సెంక్రటరీలను, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ముఖ్యమంత్రి తమను పట్టించు కోకుండా వదిలేయడం సరికాదంటున్నారు. 9 రోజులుగా కలెక్టరేట్ల ఎదుు నిర్వహిస్తున్న వీరి రిలే దీక్షలకు మొదట్నుంచీ వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 1971 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్‌లో 2023 లెక్కల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో 1971 మంది పని చేస్తున్నారు. ఇందులో డీపీఓ కాంట్రాక్టు స్టాఫ్‌ 29మంది, కేజీబీవీ, యుఆర్‌ఎస్‌లోని టీచింగ్‌, నాన్‌టీచింగ్‌, ఇతర టెక్నికల్‌ స్టాఫ్‌ 1293, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు 51, ఎంఆర్‌సీ కంప్యూటర్‌ ఆపరేటర్లు 50, ఐఈఆర్‌పీలు 88, సీఆర్‌పీలు 248, పీటీఐలు 204, ఎంఆర్‌సీ మెసెంజర్లు 47, కేర్‌ గీవర్లు 7, టీఎస్‌ఎంఎస్‌ గర్ల్స్‌ హాస్టల్‌ స్టాఫ్‌ 42 మంది ఉన్నారు. ఇందులో కరీంనగర్‌ జిల్లాలో 555మంది, సిరిసిల్ల జిల్లాలో 425, జగిత్యాల జిల్లాలో 544, పెద్దపల్లి జిల్లాలో 447 మంది ఉన్నారు.
ప్రసూతి సెలవులు ఇవ్వాలి
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెల వులు ఇవ్వాలి. హెల్త్‌కార్డులు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలి. మా ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలి.
– వైద్య దీప్తి, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్ల జిల్లా అధ్యక్షులు
ఉద్యోగ భద్రత కల్పించాలి
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఎక్స్‌గ్రేషియా కల్పించాలి. విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్‌ కల్పించాలి. ప్రభుత్వం చేయనిపక్షంలో 2014లో రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వీరిందరినీ రెగ్యులర్‌ చేస్తాం.
– మేడిపల్లి సత్యం, కాంగ్రెస్‌ చొప్పదండి
సెగ్మెంట్‌ ఇన్‌చార్జి

,
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కాం ట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. మా కాంట్రాక్టు ఉద్యోగు లందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. అప్పటి వరకు మినిమం టైం స్కేల్‌ వర్తింపజేయాలి.
– బెజ్జంకి అంజనేయులు, టీఎస్‌ఎస్‌ కాంట్రాక్టు
ఉద్యోగుల జేఏసీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిన సర్వశిక్ష అభియాన్‌ కింద
పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వివరాలు
విభాగం   కరీంనగర్‌  సిరిసిల్ల  జగిత్యాల  పెద్దపల్లి     మొత్తం
డీపీఓ    కాంట్రాక్టుస్టాఫ్‌   9 5      6 9       29
కేజీబీవీ, యుఆర్‌ఎస్‌    326    406   329   232    1293
ఎంఐఎస్ కో ఆర్డినేటర్‌ 10     12       16     13       51
ఎంఆర్‌సీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ 10 10 18 12      50
ఐఈఆర్‌పీలు         28      9       28     23             88
సీఆర్‌పీలు     80     50      69      49       248
పీటీఐలు      80     24      59     41         204
ఎంఆర్‌సీ     మెసెంజర్లు 12 9 15 11      47
కేర్‌ గీవర్స్‌     — —          4 3 7
టీఎస్‌ఎంఎస్‌      గర్ల్స్‌హాస్టల్‌స్టాఫ్‌ — — — 42 42
మొత్తం            555 425 544 447 1971

Spread the love