న్యూఢిల్లీ :వలసవాదుల కాలం నాటి రాజద్రోహ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 12న విచారిస్తుంది. మే 1న కేసు విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలు వినిపిస్తూ రాజద్రోహ చట్టానికి సంబంధించిన నిబంధనలపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరింది. బ్రిటీష్ పాలన నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన విషయం విదితమే. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేసి, నేరానికి విస్తృత నిర్వచనం ఇస్తూ నూతన నిబంధనలు రూపొందించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రాజద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఐపీసీలోని సెక్షన్ 124-ఏ (రాజద్రోహం) చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ నెల 12న విచారణ జరుపుతుంది. ఐపీసీలోని సెక్షన్ 124-ఏ ప్రకారం ‘ప్రభుత్వం పట్ల అవిధేయత’ ప్రదర్శిస్తే గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. స్వాతంత్య్రం రావడానికి 57 సంవత్సరాల ముందు 1890లో దీనిని ఐపీసీలో చేర్చారు. అప్పటికే ఐపీసీని రూపొందించి దాదాపు 30 సంవత్సరాలు గడిచాయి.