– కేసుల పరిశీలనకు కమిటీ.
– కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ : దేశంలోని పలు చోట్ల విద్వేష ప్రసంగాల కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం మోపేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ జర్నలిస్టు షహీన్ అబ్దుల్లా వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎన్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘మతాల మధ్య పరస్పర సామరస్యం, స్నేహం ఉండాలి. ఇది అన్ని మతాల బాధ్యత. విద్వేష ప్రసంగాల సమస్య ఏమాత్రం మంచిది కాదు. ఇది ఎవరికీ ఆమోదయోగ్యమూ కాదు’ అని ధర్మాసనం తెలిపింది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్‌ను ఆదేశించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించిన వీడియాలు, ఇతర సమాచారాన్ని నోడల్ ఆఫీసర్లకు అంద చేయాలని పిటిషనర్‌ను కూడా ధర్మాసం ఆదేశించింది. కమిటీ ఏర్పాటుకు పోలీస్ చీఫ్‌ను ఆదేశిస్తామనీ, వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లకు అందిన విద్వేష ప్రసంగాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని జస్టిస్ ఖన్నా పేర్కొన్నా రు. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.