తీస్తా సెతల్వాద్‌కు ఊరట

– రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు..కస్టడీ విచారణ అవసరం లేదు
– గుజరాత్‌ హైకోర్టు తీర్పు కొట్టివేత..ఆ నిర్ణయం హేతుబద్ధంగా లేదు
– పరిశీలన సక్రమంగా లేదు.. : స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గుజరాత్‌ అల్లర్లు-2002కు సంబంధించి తీస్తా సెతల్వాద్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ తిరస్కరిస్తూ, తక్షణం లొంగిపోవాలంటూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై సెతల్వాద్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించి గుజరాత్‌ హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. కల్పిత సాక్ష్యాలను సృష్టించారన్న ఆరోపణల కేసులో హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు అత్యున్నత న్యాయస్థానం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్‌పై చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
”గుజరాత్‌ హైకోర్టు నిర్ణయం హేతుబద్ధంగా లేదు. బెయిల్‌ నిరాకరణలో హైకోర్టు పరిశీలన సక్రమంగా లేదు. హైకోర్టు వాదనను అంగీకరిస్తే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226, 32, సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 482 కింద చార్జిషీట్‌ను సవాలు చేయకపోతే, దాని ఆధారంగా ఎటువంటి బెయిల్‌ పిటిషన్‌ను నిర్ణయించకూడదు. హైకోర్టు పరిశీలన రాజ్యాంగ వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంది. కస్టడీలో ఉన్నప్పుడే తీస్తా సెతల్వాద్‌ తమ పాస్‌పోర్ట్‌ను సెషన్స్‌ కోర్టుకు సరెండర్‌ చేశారు. రెగ్యులర్‌ బెయిలు మంజూరు చేస్తున్నందున సాక్ష్యాలను తారుమారు చేసే ఎలాంటి ప్రయత్నాలు చేయరాదు” అని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే ఎలాంటి ప్రయత్నాలు జరిగినా గుజరాత్‌ పోలీసులు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావచ్చని కూడా తెలిపింది.
తీస్తా సెతల్వాద్‌ తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) సెక్షన్‌ 482 కింద పిటిషన్‌ దాఖలు చేయనందున గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ నిరాకరించిందని అన్నారు. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడానికి అటువంటి కారణం మొత్తం న్యాయశాస్త్రాన్ని తలకిందులు చేస్తుందని పేర్కొన్నారు. చాలా గుజరాత్‌ అల్లర్ల కేసుల్లో దోషులకు ఎలా శిక్షలు పడ్డాయో, ఆ కేసులను విచారించడానికి సుప్రీంకోర్టు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఎలా ఏర్పాటు చేసిందో కూడా సిబల్‌ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు 2022 జూన్‌ తీర్పులో సాక్ష్యాధారాల కల్పనపై ఎలాంటి నిర్ధారణ చేయలేదని, సిట్‌ ఎప్పుడూ వాదించలేదని కూడా సిబల్‌ అన్నారు. గుజరాత్‌ రాష్ట్రమే వీరిని సాక్షులని కోర్టు ముందు సమర్పించిందని తెలిపారు. తీర్పు వెలువడిన వెంటనే సెతల్వాద్‌ను అరెస్టు చేసిన తీరును కూడా ఆయన ప్రశ్నించారు.
గుజరాత్‌ ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఎఎస్‌జీ)ఎస్‌వి రాజు మాట్లాడుతూ, బెయిల్‌ ఇస్తే సెతల్వాద్‌ సాక్షులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. అదంతా రికార్డులో ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని ధర్మాసనం పేర్కొంది.
సెతల్వాద్‌ కస్టడీ అవసరాన్ని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. సాక్ష్యానికి సంబంధించి రాష్ట్ర వాదనను అంగీకరిస్తే, చట్టంలోని సాక్ష్యాల నిర్వచనాన్ని ‘డస్ట్‌బిన్‌ (చెత్తబుట్ట)లో పడవేయవలసి ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. జ్యుడీషియల్‌ కస్టడీకి పంపే ముందు సెతల్వాద్‌ ఏడు రోజుల పాటు కస్టడీ విచారణకు సహకరించారని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన తరువాత ఆమెను ఎప్పుడూ విచారణకు పిలవలేదని కూడా పేర్కొంది. అంతేకాకుండా, చాలా వరకు సాక్ష్యాలు డాక్యు మెంటరీ అని, చార్జిషీట్‌ దాఖలు చేయబడిందని, అందువల్ల సెతల్వాద్‌ని కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో సెతల్వాద్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

Spread the love