విద్యా సంస్థల్లో కుల వివక్ష అంతానికి తీసుకున్న చర్యలేంటి?

– యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశం
– పిటిషన్‌ దాఖలు చేసిన రోహిత్‌ వేముల, పాయల్‌ తాడ్వి తల్లులు
ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులను ప్రధాన స్రవంతిలో ఎలా ఇమిడి ఉంచగలమో ప్రతిపాదించాలి. భవిష్యత్తులో అలా జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పిటిషన్‌కు అభ్యంతరాల రూపంలో సమాధానం ఇవ్వకుండా, పిటిషన్‌లో లేవనెత్తిన ఆందోళనలను యూజీసీ ఎలా పరిష్కరిస్తుందో, సరిదిద్దుతుందో తెలపాలి’
– న్యాయమూర్తులు
న్యూఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను అంతం చేయడానికి తీసుకున్న చర్యలేమిటో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ రోహిత్‌ వేముల, పాయల్‌ తాడ్వి తల్లులు రాధిక వేముల, అబేద తాడ్వి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. దీనిపై యూజీసీ స్పందనను ధర్మాసనం కోరింది. అంతిమంగా ఇది ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలకు సంబంధించినది. భవిష్యత్తులో అలా జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని యూజీసీకి జస్టిస్‌ బోపన్న సూచించారు. ఈ పిటిషన్‌ వ్యతిరేకత లేనిదని, కాబట్టీ అభ్యంతరాల రూపంలో సమాధానం ఇవ్వకుండా, పిటిషన్‌లో లేవనెత్తిన ఆందోళనలను యూజీసీ ఎలా పరిష్కరిస్తుందో, సరిదిద్దుతుందో తెలపాలని యూజీసీకి జస్టిస్‌ బోపన్న తెలిపారు.
యూజీసీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టిందో, ఏం చేయాలని ప్రతిపాదించారో తెలపాలని యూజీసీని జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ కోరారు. ఇది సున్నితమైన అంశమని యూజీసీకి తెలపాలని, ఇది విరుద్ధమైనది కాదు కాబట్టి మీరు సూచనల కోసం పిటిషనర్‌ తరపు న్యాయవాదితో కూడా చర్చించవచ్చని యూజీసీ తరపు న్యాయవాదికి జస్టిస్‌ బోపన్న సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులను ప్రధాన స్రవంతిలో ఎలా ఇమిడి ఉంచగలమో ప్రతిపాదించాలని యూజీసీకి జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ సూచించారు.
పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌, న్యాయవాది దిశా వాడేకర్‌ వాదనలు వినిపించారు. విద్యా సంస్థల్లో కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి 2012లో యూజీసీ రూపొందించిన ఈక్విటీ నిబంధనలు సరిపోవని స్పష్టం చేశారు. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండే స్వభావం లేకపోవడం దురదృష్టకరమనీ, ఎందుకంటే నిబంధనలను ఉల్లంఘించినందుకు వాటిపై చర్యలేమీ లేవని అన్నారు. ఈ నిబంధనలు కూడా యాంటీ ర్యాంగింగ్‌ నిబంధనలు వంటి వాటివేనని, అవి ఎప్పుడూ అమలు కావటంలేదని ఇందిరా జైసింగ్‌ అభిప్రాయపడ్డారు.
2019 సెప్టెంబర్‌ నాటికే ఈ విషయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేశామని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2023లో ఇప్పటికీ మరో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరమనీ, వారిలో ఒకరు నేషనల్‌ లా స్కూల్‌లో, ఒకరు మెడికల్‌ కాలేజీలో, ఒకరు ఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌ చాలా ముఖ్యమైనదని, అన్ని ఉన్నత విద్యా సంస్థలకు మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు.
రాధిక వేముల కుమారుడు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకోగా, ముంబాయిలోని టిఎన్‌ టోపివాలా నేషనల్‌ మెడికల్‌ కాజేలీలో ఆదివాసీ విద్యార్థిని, అబేదా తాడ్వీ కుమార్తె పాయల్‌ తాడ్వీ 2019 మే 22న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు ఆత్మహత్యలకు గల ప్రధాన కారణం విద్యా సంస్థల్లో జరిగిన కుల వివక్షేనని స్పష్టమైంది.

Spread the love