చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే

ఉపసంహరించుకోవాల్సిందే : బాంబే హైకోర్టు
ముంబయి: చట్ట సభలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా వుంటే వాటిని ఉపసంహరించుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. నకిలీ, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలపై విచారణలో బాంబే హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టంలోని నిబంధనలు రూపొందించేప్పుడు మన ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉన్నా సరే.. వాటి ప్రభావం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని మానుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలపై పిటిషన్లను హైకోర్టు గురువారం విచారించింది. ఆన్‌లైన్‌ కంటెంట్‌లో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో పేర్కొంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌-2021కు సవరణలు చేసింది. అయితే, ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ నిబంధనల చెల్లుబాటను సవాల్‌ చేస్తూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యాగజైన్స్‌ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Spread the love