– ఏఐకేఎస్ నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో 61 రోజుల రైతుల పోరాటం తరువాత పరిశ్రమల శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని ఏఐకేఎస్ నాయకులు తెలిపారు. సోమవారం నాడిక్కడ ఏఐకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కష్ణన్, ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా, కోశాధికారి పి.కష్ణప్రసాద్, రైతు పోరాటానికి నాయకత్వం వహించిన నేతలు రూపేష్ వర్మ, వీర్‌సింగ్ నగర్, బ్రహ్మపాల్ సుబేదార్, సురేశ్ ముఖ్య, నిషాత్ రావల్, మహరాజ్‌సింగ్ ప్రధాన్ మాట్లాడుతూ నోయిడా పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు 20 రోజుల పాటు నాయకులను జైల్లో పెట్టి లాఠీచార్జి చేసి యోగి ప్రభుత్వం మోకరిల్లాల్సి వచ్చిందన్నారు. డిమాండ్‌లన్నింటినీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆమోదిం చిందని, చారిత్రాత్మక పోరాట విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపిందని తెలిపారు. ఈ వేడుకలను బుధవారం గ్రేటర్ నోయిడాలోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామన్నారు. ఈనెల 28న గ్రేటర్ నోయిడాలో, జూలై 10న రాష్ట్రాల్లోనూ విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ”ఈ నెల 30న నోటిఫికేషన్‌తో కమిటీ ఏర్పాటు అమల్లోకి రానుందని, చైర్మెన్‌గా మంత్రితో పాటు గ్రేటర్ నోయిడాకు చెందిన ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, అథారిటీ సీఈవోలు కూడా కమిటీలో ఉంటారు. ఏడు నుంచి పదకొండు మంది రైతు నాయకులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ తన నివేదికను జూలై 15లోగా సమర్పించాలి. పదమూడేళ్ల క్రితం, గ్రేటర్ నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీ స్వాధీనం చేసుకున్న భూమిని జాబితా చేయడం, బాధితులకు చట్టపరమైన పరిహారం, పునరావాసం, నలభై చదరపు మీటర్ల భూమిని నిర్ధారించడం వంటి గ్రేటర్ నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించవలసి వచ్చింది” అని తెలిపారు.