మా ఆదేశాలంటే లెక్క లేదా?

– ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలంటే లెక్క లేదా అని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు ఉపశమనం కల్పించే విషయంలో గత సంవత్సర కాలంగా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ అధికారులపై మండిపడుతూ కోర్టు ఆదేశాలంటే వారికి గౌరవం లేకుండా పోతోందని తప్పుపట్టింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో గవర్నర్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న ప్రభుత్వ వాదనను ప్రస్తావిస్తూ ‘ఎవరైనా కానివ్వండి. చట్టానికి అతీతులు కారు. ఖైదీలలో చాలా మంది 30 సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్నారు. క్షమాభిక్ష కోసం వారు పెట్టుకున్న దరఖాస్తులను మూడు నెలలలో పరిష్కరించాలని మేము గత సంవత్సరం మేలో ఆదేశించాం’ అని గుర్తు చేసింది. ఖైదీల దరఖాస్తులను నాలుగు వారాలలో పరిష్కరించని పక్షంలో ఆగస్ట్‌ 29న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Spread the love