కుకీ గిరిజనుల రక్షణపై

అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కృతి
న్యూఢిల్లీ : మణిపూర్‌ జాతుల మధ్య ఘర్షణలు, హింస అనేది పూర్తిగా శాంతి భద్రతల అంశమని సుప్రీం కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. సైన్యం లేదా కేంద్ర భద్రతా బలగాలను మోహరించాల్సిందిగా కోర్టులను కోరబోరని ఆశిస్తున్నామని పేర్కొంది. కుకీ గిరిజనులకు సైనిక రక్షణ కల్పించాలంటూ మణిపూర్‌ గిరిజన వేదిక ఢిల్లీ (ఎంటిఎఫ్‌డి) దాఖలు చేసిన పిటిషన్‌ను ఒకటి రెండు రోజుల్లో అత్యవసరంగా విచారణకు స్వీకరించడానికి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ తిరస్కరించింది. వేసవి శలవులు ముగిసిన తర్వాత జులై 3వ తేదీన విచారిస్తామని తెలిపింది. ఈ దశలో ఏదో ఒక రకంగా కోర్టు జోక్యం చేసుకుంటే రాష్ట్రంలో పరిస్థితి మరింత పెచ్చరిల్లుతుందని బెంచ్‌ పేర్కొంది. మే 3వ తేదీ నుండి కుకీ, మెయితీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు తలెత్తాయి. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే విషయంలో ప్రభుత్వాన్ని నమ్మాలని, ప్రభుత్వం ఆ దిశగానే పనిచేస్తోందని బెంచ్‌ మౌఖిక వ్యాఖ్యలు చేసింది. మణిపూర్‌, కేంద్ర ప్రభుత్వాల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ, భద్రతా బలగాలు క్షేత్ర స్థాయిలో శాయశక్తులా కృషి చేస్తున్నాయని చెప్పారు.

Spread the love