మోడీ గారూ .. మౌనం వీడండి

 ‘మణిపూర్‌ మామ్స్‌’
న్యూఢిల్లీ :ఇంఫాల్‌లోని మహిళలు నిర్వహిస్తున్న ‘ఎమా కైథాల్‌’ లేదా ‘మదర్స్‌ మార్కెట్‌ ‘ ప్రతినిధులు రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మౌనం వీడి.. చర్యలు చేపట్టాలంటూ మోడీకి ఓ సందేశాన్ని పంపారు. వీరంతా హిందూ మరియు పంగల్‌ ముస్లిం వర్గాలకు చెందిన మెయిటీలు. మణిపూర్‌లో హింసను నిరోధించేందుకు, రాష్ట్ర సమగ్రతను కాపాడేందుకు ప్రధాని చర్యలు చేపట్టాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఓట్ల కోసం బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రధాని సహా ఇతర కేంద్ర మంత్రులు తమ రాష్ట్రానికి వరుస కట్టారని, ప్రస్తుతం హింసాకాండలో ప్రాణాలు కోల్పోతున్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సోమవారం న్యూఢిల్లీ చేరుకున్న ప్రతినిధుల బృందం జంతర్‌ మంతర్‌లో ఆందోళన చేపట్టింది. మెయిటీ భాషలో అనువాదకుల ద్వారా వారు మీడియాకు అక్కడి పరిస్థితులను వివరించారు. ఆస్తి, నగలు నష్టాన్ని పునరుద్ధరించుకోవచ్చు, కానీ ప్రాణనష్టం అలా కాదని బినోదిని అనే ప్రతినిధి పేర్కొన్నారు. కొండలు, అడవులు తేడా లేకుండా ఆగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో అక్కడి తల్లులు, యువకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ముందు తమ ఫిర్యాదులను తెలిపేందుకు ఇక్కడకు వచ్చామని.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులను అడ్డుకునేలా ప్రధాని జోక్యం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న హింసాకాండపై ప్రధాని మోడీ స్పందించలేదని, కనీసం రాష్ట్రాన్ని సందర్శించలేదని అన్నారు. ఒకవేళ జాతి ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందా అని వారు అనుమానం వ్యక్తం చేశారు.
హింస ప్రారంభమైన 20 రోజుల తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మణిపూర్‌లో పర్యటించారని, కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మరో ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా పర్యటన సమయంలోనూ రాష్ట్రంలో హింస నెలకొందని మరో ప్రతినిధి పేర్కొన్నారు. ఈ హింసాకాండలో అధికశాతం మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, తమ పిల్లలకు బదులుగా తల్లులమైన తాము ఇక్కడ ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరో ప్రతినిధి తెలిపారు.
మృతులకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని హోం మంత్రి ప్రకటించారని, తాము డబ్బు కోరుకోవడం లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు మెరుగైన చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నా మని మరో ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని, హింసాకాండకు కుకీ తిరుగుబాటుదారులను బాధ్యులను చేయాలని, సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ అగ్రిమెంట్‌, 2008 నుండి ఉపసంహరించుకోవడం వంటి కీలక డిమాండ్లతో మెమొరాండం సమర్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి పలు మెమొరాండంలు సమర్పించామని, కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మణిపూర్‌లో మే 3న మెయిటీలు, కుకీల మధ్య నెలకొన్న ఘర్షనలు ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. సుమారు 110 మంది మరణించగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు.

 

Spread the love