మణిపూర్‌లో ఆగని హింసాకాండ

– తాజాగా మరో మహిళ మృతి
ఇంఫాల్‌, న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోనే ఉంది. తాజాగా ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలో ఒక పాఠశాల బయట ఒక మహిళను సాయుధ దుండగులు కాల్చి చంపారు. స్థానిక శిశు నిష్తా నికేతన్‌ పాఠశాల ఎదుట గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. స్కూళ్లు తెరిచిన మరుసటి రోజే ఈ హత్య జరగడం గమనార్హం. సుమారు రెండు నెలల తరువాత బుధవారం నుంచి మణిపూర్‌లో పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో హింసాకాండ కారణంగా గత రెండు నెలలుగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తిరిగి తెరిచారు. హింసాకాండ భయంతో తొలి రోజు విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. తాజాగా పాఠశాల బయట మహిళను చంపేయడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
అలాగే, బుధవారం థౌబల్‌ జిల్లాలో ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌(ఐఆర్‌బి)కు చెందిన ఓ జవాను ఇంటిని దుండగులు గుంపు దహనం చేసింది. పోలీసు విభాగానికి చెందిన ఆయుధశాల నుంచి తుపాకులను ఎత్తుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారన్న ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు పాల్పడింది.
హైకోర్టును ఆశ్రయించండి : మణిపూర్‌లో ఇంటర్‌నెట్‌ నిషేధంపై సుప్రీం
మణిపూర్‌లో రెండు మాసాలుగా అమల్లో వున్న ఇంటర్‌నెట్‌ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మణిపూర్‌ హైకోర్టు దీన్ని ఇప్పటికే విచారించిందని పేర్కొంది. ”దీనిపై డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్ళరు? ఎందుకంటే, మేం నోటీసులు జారీ చేసిన మరుక్షణం హైకోర్టు దీన్ని పరిశీలించడం ఆపేస్తుంది.” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన బెంచ్‌ ఇద్దరు పిటిషనర్లకు చెప్పింది. మణిపూర్‌ హైకోర్టు న్యాయవాది చోగతమ్‌ విక్టర్‌ సింగ్‌, వ్యాపారవేత్త మయేంగ్భమ్‌ జేమ్స్‌లు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంలో హైకోర్టు ఇంతవరకు దామాషా సూత్రాన్ని పరిశీలించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది షాదన్‌ ఫరాసత్‌ చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, హైకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించవచ్చా లేదా అనేది పరిశీలించాల్సిందిగా ఆ కమిటీని ఆదేశించిందని చెప్పారు. ”షాదన్‌ ఫరాసత్‌ ఈ విషయంలో దామషా సూత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని చెబుతున్నారు. పైగా 226వ అధికరణపై పిటిషన్‌ కూడా పెండింగ్‌లో వున్నందున, ఈ అంశాన్ని ఇక ఇక్కడితో ఉపసంహరించుకోవడానికి ఫరాసత్‌ అనుమతి కోరుతున్నారు. పెండింగ్‌లో వున్న అంశంలో జోక్యం చేసుకుని, హైకోర్టులో స్వతంత్ర పిటిషన్‌ దాఖలుచేయడానికి అనుమతి కోరుతున్నారు. అనుమతి మంజూరు చేయబడింది” అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. తొలుత మే 3న మణిపూర్‌లో ఇంటర్‌నెట్‌ను నిషేధించారు. తర్వాత అనేకసార్లుగా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నిర్దిష్ట ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌కు పరిమితంగానైనా అవకాశం కల్పించాల్సిందిగా జూన్‌ 16న మణిపూర్‌ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్‌ 20న ఈ మేరకు బహిరంగంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోలేదు.
స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో మణిపూర్‌పై చర్చకు నిరాకరణ : ప్రతిపక్ష ఎంపీల వాకౌట్‌
న్యూఢిల్లీ : మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలన్న తమ డిమాండ్‌ నిరాకరించడంతో ముగ్గురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. గురువారం స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బ్రిజ్‌లాల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీలు దిగ్విజయ సింగ్‌, ప్రదీప్‌ భట్టాచార్య, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ ముగ్గురూ సమావేశం ప్రారంభమైన పది నిమిషాలకే నిష్క్రమించారు. జైళ్ల స్థితిగతులపై చర్చ చేపట్టేలోపు మణిపూర్‌ పరిస్థితిపై కమిటీ అత్యవసరంగా చర్చించాలని ఈ ముగ్గురు ఎంపిలు డిమాండ్‌ చేశారు. జైలు పరిస్థితులపై చర్చ తరువాత జరగవచ్చని, మణిపూర్‌ గురించి త్వరగా చర్చించాలని కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌ కోరారు. మణిపూర్‌లో ”తీవ్రమైన సంక్షోభం”లో ఉన్న పరిస్థితిని చర్చించాల్సిన అవసరాన్ని బ్రిజ్‌ లాల్‌కు రాసిన లేఖలో ఓబ్రెయిన్‌ నొక్కి చెప్పారు. మణిపూర్‌లో హింసకు ముగింపు అవసరం అని అన్నారు. మణిపూర్‌పై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గత నెలలో కొందరు ఎంపిలు చైర్మన్‌కు లేఖలు కూడా రాశారని, సమావేశ ఎజెండాను నిర్ణయించడం ఛైర్మన్‌కు ఉన్న అధికారమని నొక్కిచెప్పినట్టు లేఖలో గుర్తు చేశారు. సరిహద్దు రాష్ట్రంలో 100 మందికి పైగా మరణించిన మరియు 50,000 మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాల్సిన పరిస్థితి గురించి దిగ్విజయ సింగ్‌ గత నెలలో బ్రిజ్‌ లాల్‌కు లేఖ రాశారు. మతపరమైన మలుపు తీసుకున్న ఈ హింసలో 250కి పైగా చర్చిలు, 100 దేవాలయాలు ధ్వంసమయ్యాయని, 2,000 ఇళ్లు తగలబడిపోయాయని సింగ్‌ లేఖలో పేర్కొన్నారు.

Spread the love