– 2025 ఫిబ్రవరి కల్లా పూర్తి
– రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల 1,200మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ఫ్యాక్టరీతో పరిసర ప్రాంతాల్లో పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. గురువారం హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్‌ను సందర్శించిన అనంతరం అయోధ్యపురంలో ఈనెల 8న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న వ్యాగన్ తయారీ కేంద్రం ప్రతిపాదిత స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడుతూ.. గతంలోనే ఇక్కడ వ్యాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయన్నారు. పీఓహెచ్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ వ్యాగన్ తయారీ కేంద్రాన్ని నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పీఓహెచ్ యూనిట్‌తోపాటు వ్యాగన్ తయారీ కేంద్రం నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యాగన్ తయారీ కేంద్రం కొల్‌కతాలో ఒకటుందని, దాని తరువాత ప్రభుత్వ నియంత్రణలో ఏర్పాటుచేస్తున్న రెండో వ్యాగన్ తయారీ కేంద్రమిదేనని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, తమ చేతుల్లో ఏమీ లేదని, ఇది రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ఈ పరిశ్రమ 2025 ఫిబ్రవరిలో పూర్తవుతుందని తెలిపారు. యాదాద్రి ఎంఎంటీఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదని, కేంద్రం ఇచ్చే నిధులతోనే వచ్చే 3 నెలల్లో మరోమారు ఎంఎంటీఎస్ నిర్మాణానికి టెండర్ పిలవనున్నట్టు చెప్పారు. రైల్వే కోచ్‌ల కంటే వ్యాగన్‌లకు అధిక డిమాండ్ ఉందన్నారు. వచ్చే నాలుగేండ్లలో వ్యాగన్‌ల డిమాండ్ పెద్ద ఎత్తున పెరగనుందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఆర్డర్‌లను బట్టి వివిధ రకాల వ్యాగన్‌లను, వివిధ సైజ్‌లతో నిర్మించడం జరుగుతుందన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌పై ప్రశ్నించగా, అది విధానపరమైన నిర్ణయమని, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని సమాధానం దాటవేశారు. విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఎకే గుప్తా, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌విఎన్‌ఎల్) ప్రాజెక్టు మేనేజర్ మున్నా కుమార్, సీపీఆర్‌ఓ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.