‘మట్టి’ దొంగలు

యధేచ్ఛగా దోపిడీ..
– నిద్రావస్థలో మైనింగ్‌, రెవెన్యూ యంత్రాంగం
నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అక్రమ మైనింగ్‌ దందా నిత్యకృత్యంగా మారింది. అనుమతులుండవు.. ఒకవేళ అనుమతులున్నా, అనుమతించిన దాని కంటే పెద్ద ఎత్తున మైనింగ్‌ చేస్తూ కోట్ల రూపాయలు అక్రమార్కులు దండుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొరం దందా జరుగుతున్నా మైనింగ్‌, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అదేమంటే పర్మిట్‌ ఉందని చెబుతారు.. ఎన్ని క్యూబిక్‌ మీటర్లకు అనుమతి ఉంది.. ఎన్ని క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించారో తేల్చని పరిస్థితి. ఈ మైనింగ్‌ దందాలో మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోక పోవడం శోచనీయం.
హన్మకొండ, ములుగు జిల్లాల పరిధి ఒగ్లాపూర్‌- ములుగు గట్టమ్మతల్లి గుట్ల వరకు రూ.208 కోట్ల అంచనాతో జాతీయ రహదారి-163కు సంబంధించి 4 వరుసల రహదారి నిర్మాణపు పనులను ‘వృద్ధి ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌’ కంపెనీ దక్కించుకుంది. మరో రూ.92 కోట్లు జీఎస్టీ, భూనిర్వాసితులకు పరిహారానికి కేటాయించారు. దామెర బైపాస్‌ నుంచి ఆత్మకూరు వరకు 9 కిలోమీటర్లు, నీరుకుల్ల-ములుగు గట్టమ్మ తల్లి గుట్ట వరకు 21 కిలోమీటర్ల మేరకు మొత్తం 30 కిలోమీటర్లు 4 వరుసల రహదారిని నిర్మించాల్సి ఉంది. రోడ్డు విస్తరణ, కల్వర్టుల విస్తరణతోపాటు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను ఈ కంపెనీ 2024 జులైలోపు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రహదారి పనులకు దామెర మండలం వెంకటాపురం, ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ చెరువు నుండి పెద్ద ఎత్తున మొరం తవ్వకాలు జరిపి రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్న మట్టిని అక్రమంగా దోపిడీ చేస్తోంది. అధికారులు ఇచ్చిన అనుమతులకు భిన్నంగా అధికంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా మైనింగ్‌, రెవెన్యూ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. పైగా అధికారులు ఇచ్చే వివరణలు సైతం హాస్యాస్పదంగా ఉన్నాయి.
కటాక్షపూర్‌ చెరువులో ప్రమాదకరంగా తవ్వకాలు
ఈ జాతీయ రహదారి సమీపంలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ చెరువులో వృద్ధి కంపెనీ అక్రమంగా మొరం తవ్వకాలు జరిపింది. రెవెన్యూ అధికారులు వృద్ధి కంపెనీకి 14 వేల మెట్రిక్‌ టన్నుల మొరం తవ్వకానికి తాత్కాలిక అనుమతినిచ్చారు. సదరు కంపెనీ దామెర మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో 25,419 మెట్రిక్‌ టన్నుల మొరాన్ని అక్రమంగా తవ్వి రహదారి నిర్మాణంలో వినియోగించారు. 11,419 మెట్రిక్‌ టన్నుల మొరాన్ని అక్రమంగా తవ్వి తరలించినందుకు కంపెనీకి రూ.15.52 లక్షల జరిమానాను మైనింగ్‌ శాఖ విధించింది. కాగా, జాతీయ రహదారికి అత్యంత సమీపంలో చెరువులో ఈ తవ్వకాలు జరపడంతో చెరువులో లోతు పెరిగింది. వర్షాలు పడితే ఈ అక్రమ తవ్వకాలు జరిపిన ప్రాంతంలో లోతు తెలి యక చిన్నారులు, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశముంది. నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు చోద్యం చూస్తుండటంతో పెద్ద ఎత్తున చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఈ విషయంలో జిల్లాస్థాయి అధికారులు సైతం ప్రేక్షకపాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తుంది. మైనింగ్‌ దొంగలు ప్రకృతిని విధ్వంసం చేస్తూ కోట్లాది రూపాయలను సంపాదిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పటికైనా ఈ మట్టి దొంగలను కనిపెట్టి శిక్షించాలని, అక్రమ మైనింగ్‌ దందాను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love